వినుకొండ: పట్టణానికి చెందిన అంతర్జాతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లాకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో దేశం తరఫున 10 కిలోమీటర్ల పోటీలో పాల్గొనేందుకు ఎంపిక అయ్యే అవకాశం లభించింది. ఈ మేరకు ఇండియన్ ఎల్‌ఈడీ కోఆర్డినేటర్ డాక్టర్ సునీత గోదారా ఒక ప్రకటనలో తెలిపారు. అబ్దుల్లాలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి 10 కిలోమీటర్ల పరుగు పందెంలో ఎంపిక అయ్యేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అబ్దుల్లా మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా అథ్లెటిక్స్‌లో పలు విజయాలు సాధించినట్లు తెలిపారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పది కిలోమీటర్ల పరుగు పందెంలో నిర్దేశిత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయగలిగితే దేశం తరఫున అర్హత సాధించవచ్చని తెలిపారు. మెరుగైన శిక్షణతో ఆ లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయం ప్రపంచవ్యాప్తంగా జరిగే ట్రయల్ టెస్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఒలింపిక్స్ లక్ష్యంగా ఉత్తరాఖండ్‌కు చెందిన కోచ్ కెప్టెన్ అమ్లేష్ కుమార్ వద్ద కొంతకాలంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): నెల్లూరులో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించిన 70వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ షూటింగ్ పోటీలలో గుంటూరుకు చెందిన ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ విద్యార్థి అశ్రీత్ చౌదరి అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడని అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్–14 బాలుర విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పీప్‌సైట్ ఈవెంట్‌లో అశ్రీత్ తన ప్రతిభను చాటుకొని ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నాడన్నారు. అశ్రీత్ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.94 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 21 రోజులకు గాను అమ్మవారి ప్రధాన ఆలయం ఆలయ ప్రాంగణంలోని హుండీల ద్వారా రూ.3,94,31,637 కోట్ల నగదు లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లభించిన ఆదాయంలో రూ.3,77,11,637 నోట్లుగాను, రూ.17.20 లక్షలు నాణేలుగా వచ్చాయన్నారు. 321 గ్రాముల బంగారం, 3.190 కిలోల వెండి లభించినట్టు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవోతో పాటు ఏసీ రంగారావు, ఏఈవో ఎన్.రమేష్‌బాబు, చంద్రశేఖర్, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నర్సాపూర్ – నాగర్‌సోల్ (12787),నాగర్‌సోల్ – నర్సాపూర్ (12788),విశాఖపట్నం–గుంటూరు(22875), గుంటూరు–విశాఖపట్నం (22876) రైళ్లను జనవరి నుంచి సాధారణ ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసులుగా మార్చినట్లు రైల్వే ప్రకటించింది. ఇప్పటి నుంచి సవరించిన కొత్త సర్వీసు నంబర్‌లతో ఈ రైళ్లు నడవనున్నాయి. నర్సాపూర్ – నాగర్‌సోల్ (17241) జనవరి రెండో తేదీ నుంచి, నాగర్‌సోల్ – నర్సాపూర్ (17242) జనవరి మూడో తేదీ నుంచి, విశాఖపట్నం– గుంటూరు (18531), గుంటూరు – విశాఖపట్నం (18532) జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సర్వీసు నంబర్లతో నడవనున్నాయి.


