టీడీపీలో అసమ్మతిని రాజేసిన కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పార్టీని నమ్ముకున్న వారిని కాదని.. ఇష్టారాజ్యంగా టికెట్ల పంపిణీ ఇప్పుడు పార్టీకి సహకరించలేదంటూ షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు బెదిరేదే లేదు అంటున్న ఆ పార్టీ క్యాడర్
గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యేకు ఎదురుగాలి
పట్నంబజారు: గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల పరిణామాలు ఇప్పుడు ఎమ్మెల్యేకు రాజకీయ తలనొప్పిగా మారాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, ఇష్టారాజ్యంగా సీట్లు కేటాయించారన్న వివాదం ఒకవైపు.. ఎన్నికల్లో పార్టీకి సహకరించలేదంటూ ఇప్పుడు షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లకు దిగడం మరోవైపు తీవ్ర దుమారం రేపుతోంది. ‘ఎన్నికల ముందు మా మాట వినలేదు.. ఇప్పుడు మాత్రం క్రమశిక్షణ గుర్తుకొచ్చిందా? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’ అంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఎదురు తిరుగుతుండటంతో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగులుతోంది.
ఇష్టారాజ్యంగా
సీట్ల కేటాయింపుపై గుర్రు
టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులో జిల్లా అధ్యక్షుడికి కీలక బాధ్యత ఉంటుంది. జిల్లా పార్టీ నాయకత్వం, సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేసేవారు. అయితే ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్యేలే అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులో కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా జిల్లా అధ్యక్షుడు సైతం డూడూ బసవన్నలా తలాడించారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి, ఎవరికిపడితే వారికి టికెట్లు కేటాయించారనే వివాదం తెరపైకి వచ్చింది. దీంతో టికెట్లు ఆశించిన నాయకులు, సీనియర్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగగా, మరికొందరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఎన్నికల ముందు కనీసం సీనియర్ నాయకులందరినీ ఒకచోట కూర్చోబెట్టి అభిప్రాయాలు తీసుకోలేదని పార్టీ అగ్రశ్రేణి నాయకులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తమను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకొని, ఇప్పుడు పార్టీకి సహకరించలేదని నిందించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నట్లు తెలుస్తోంది.
తూర్పు ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతోనే..!
మరోవైపు నోటీసులు అందుకున్న నాయకులు వివరణ ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ‘మాకు అన్యాయం జరిగినప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు మీకు నచ్చినట్లు నోటీసులు పంపిస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ ఎదురు తిరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు అసంతృప్తిని చల్లార్చకుండా, ఇప్పుడు చర్యలతో కేడర్‌ను కట్టడి చేయాలన్న దురాలోచేన బెడిసికొడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల కేటాయింపు నుంచి మొదలైన వివాదం ఇప్పుడు క్రమశిక్షణ చర్యల వరకు చేరడంతో తూర్పు నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి. సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తుండటం ఎమ్మెల్యే నాయకత్వానికి సవాలుగా మారింది. దీనికి తగ్గట్లు కార్యాలయానికి పిలిచినప్పటీకీ.. పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు రాకపోవటం ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. కనీసం లెక్క కూడా చేయని పరిస్థితులు దాపురించాలయని చెప్పుకొంటున్నారు. దీనికి ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలే కారణమే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు తూర్పు ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కనీసం క్యాడర్ కూడా పట్టించుకోకుండా.. వ్యవహరిస్తుంటంతో.. కూటమి కోటలకు బీటలు వారుతున్నాయని తెలుస్తోంది.


