గుంటూరు రూరల్: మండలంలోని వెంగళాయపాలెం గ్రామానికి గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ అకాడమీలో ఫౌండేషన్ కోర్సు, ప్రాథమిక కోర్సులు అభ్యసిస్తున్న ఏడుగురు జిల్లా జడ్జిలు (ఎంట్రీ లెవల్), పదకొండు మంది సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్) ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ పార్థసారథి నేతత్వంలో సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలతో వివిధ అంశాలపై చర్చించారు. గ్రామస్తులకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించి, న్యాయ సలహాలు అందించారు. వ్యవసాయం, అటవీ హక్కుల చట్టం, పట్టాలు, బాల్య వివాహాలు, వెట్టిచాకిరీ (బాండెడ్ లేబర్), మానవ అక్రమ రవాణా, గ్రామసభల ద్వారా వివాదాల పరిష్కారం తదితర వాటిపై అవగాహన కల్పించారు. వెస్ట్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్, ఈఓ రవి, పంచాయితీ అధికారులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో 2026 జూలై, ఆగస్టులో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎ.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఏఎన్‌యూ నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్ పరీక్షలకు 1009 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 728 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎమ్మెస్సీ ఆయిల్స్, ఫ్యాట్స్, పెట్రో ప్రొడక్ట్స్ పరీక్షలకు 14 మంది హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 20వ తేదిన రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతిని 21వ తేదీ లోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రతి సబ్జెక్ట్‌కు రీవాల్యుయేషన్ ఫీజు రూ. 1860 కాగా వ్యక్తిగత వెరిఫికేషన్ కోసం రూ. 2190 చెల్లించాలని సీఈ పేర్కొన్నారు.
నెహ్రూనగర్ : గుంటూరు నగరంలో రూ.74.25 కోట్ల అంచనా వ్యయంతో 13.5 మెగా వాట్ల క్యాప్టివ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ముందడుగు వేసింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్‌ఐయూఏ) ఆధ్వర్యంలోని కై ్లమేట్ ప్రాజెక్ట్స్ ప్రిపరేషన్ ఫెసిలిటీ (సిపిపిఎఫ్) సహకారంతో గురువారం ఆన్‌న్‌లైన్ ద్వారా ఈ ఒప్పందం కుదిరినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.
ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.60.75 కోట్లతో సోలార్ ప్లాంట్, రూ.13.50 కోట్లతో 3 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండేళ్ల నిర్మాణ కాలంతో కలిపి 27 సంవత్సరాల కన్సెషన్ కాలానికి ఉండే ఈ ప్రాజెక్ట్ ద్వారా యూనిట్ విద్యుత్ సుమారు రూ.3 నుంచి రూ.3.15 ధరకే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గి, కర్బన ఉద్గారాలు నియంత్రించబడతాయని, గుంటూరును హరిత ఇంధన వినియోగంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కషి చేస్తామని కమిషనర్ వెల్లడించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్‌పేట 12/3లోని వావిలాల సంస్థ గ్రంథాలయ శాస్త్ర పాఠశాల ఆధ్వర్యంలో గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సు (సీఎల్‌ఐఎస్) లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపాల్ దోనె రాంబాబు గురువారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్హతలు గల అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఐదు నెలల కాల పరిమితి గల కోర్సును ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. వివరాలకు సంస్థ కార్యాలయంతో పాటు 93962 38946 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


