పట్నంబజారు: కూటమి సర్కార్ వచ్చాక ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో గుంటూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకున్న ఘటనే దీనికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. పెదనందిపాడుకు చెందిన ఒంటిపులి శివయ్య (62) సత్తెనపల్లిలో తన బంధువులు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో బస్సు రావడంతో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు. ఆయన రద్దీ తీవ్రతకు అదుపుతప్పి బస్సు టైరు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాతగుంటూరు ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి కూడా ఇటీవల బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద బస్సు ఎక్కి చేబ్రోలులోని తన కళాశాలకు వెళ్తున్నాడు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో నిలబడి ప్రయాణించాడు. బుడంపాడు బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలు అయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
నిత్యం సమస్యలు
బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించడం, వచ్చిన బస్సుల్లో సీట్ల కోసం పోటీపడటం, ఫుట్‌బోర్డులపై ప్రయాణించడం వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. బస్సు ఎక్కే క్రమంలో తోపులాటలు, తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నారు. దీనిపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రవేశపెట్టిన పథకానికి తగిన సదుపాయాలు కల్పించకపోవడంతో అది ప్రజలకు ఇబ్బందిగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెరిగిన ప్రయాణికులు
గుంటూరు రీజియన్ పరిధిలో గుంటూరు–1, గుంటూరు–2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోలు ఉన్నాయి. వీటితో పాటు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లోని పల్నాడు సెక్టార్ అత్యంత కీలకమైనది. గుంటూరు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం సగటున లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారని గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఈ రీజియన్ పరిధిలో సుమారు 393 బస్సులు అందుబాటులో ఉండేవి. అయితే, విద్యుత్ బస్సుల ఏర్పాటుకు సంబంధించి డిపో–2 పరిధిలో ఉన్న సుమారు వంద బస్సులను ఇతర డిపోలకు పంపించారు. ఈ పరిస్థితుల్లో అత్యంత రద్దీగా ఉండే డిపో–2లో బస్సుల సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు, సీ్త్ర శక్తి పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరగడం, అందుకు తగ్గట్టుగా అదనపు బస్సులను ఏర్పాటు చేయకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది.
సీటు కోసం సాహసం చేయాల్సిందే..
గుంటూరు రీజియన్ పరిధిలోని ప్రధాన బస్టాండ్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరుతున్నారు. బస్సు వస్తుందనే సమాచారం అందగానే ముందుగా ఎక్కేందుకు పోటీపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారు సైతం ఈ రద్దీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులో సీటు దక్కించుకోవాలనే ఆత్రుతతో ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బస్సు పూర్తిగా ఆగకముందే ఎక్కేందుకు ప్రయత్నించడం ప్రమాదకరంగా మారుతోంది. బస్సులో చోటు దక్కకపోతే ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రయాణికుల ప్రాణాలు సురక్షితమేనా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. చాలాసార్లు ప్రయాణికులు కిందపడటం, వాహనం కిందకు వెళ్లడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
పల్నాడు సెక్టార్‌పైనా ప్రభావం
గుంటూరు రీజియన్‌లో పల్నాడు సెక్టార్ కూడా అత్యంత ప్రాధాన్యం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి గుంటూరు నగరానికి విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గడంతో పలు మార్గాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణించాల్సి వస్తోంది. పీక్ అవర్స్‌లో అదనపు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు కిక్కిరిసిపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. బస్సుల కొరతపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. గుంటూరు రీజియన్‌లో గతంలో ఉన్న బస్సుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. తరలించిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఎప్పుడు సమకూరుస్తారో స్పష్టం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రద్దీ మార్గాలను గుర్తించి అదనపు సర్వీసులు నడపాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
ప్రజా రవాణాను బలోపేతం చేయాల్సిన కూటమి ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడంలో మాత్రం చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.


