తాడేపల్లి రూరల్: పాస్టర్ల పెండింగ్ గౌరవ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ జయప్రకాష్ గురువారం తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ అమర్లపూడి శేఖర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. జయప్రకాష్ మాట్లాడుతూ అర్హులైన పాస్టర్లకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న గౌరవ వేతనాలు సక్రమంగా అందడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఉన్న అర్హులైన క్రైస్తవ పాస్టర్లకు తక్షణమే గౌరవ వేతనాలు చెల్లించాలని, 2025 డిసెంబర్ నుండి 2026 నవంబర్ వరకు మొత్తం 12 నెలలకు సంబంధించిన పెండింగ్ గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటివరకు గౌరవ వేతనం అందని అర్హులైన పాస్టర్లకు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, అర్హులైన ప్రతి పాస్టర్‌కు ప్రభుత్వ పథకం ద్వారా న్యాయం జరిగే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమర్లపూడి శేఖర్ సానుకూలంగా స్పందిస్తూ, పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ నెలలో పెండింగ్‌లో ఉన్న 12 నెలల గౌరవ వేతన బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు.


