తాడేపల్లి రూరల్: మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంతోపాటు లైంగిక వేధింపుల నుంచి చట్టపరమైన రక్షణ పొందే విధానాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గౌతమి శ్వేత కోట పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గౌతమి శ్వేత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల హక్కులు, కార్యాలయాల్లో భద్రత, లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోష్ చట్టం) గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. మహిళలు పని ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులకు గురికాకుండా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని వివరించారు. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు వారి వ్యక్తిగత జీవితంపైనే కాకుండా, వృత్తిపరమైన ఎదుగుదల, ఆత్మవిశ్వాసంపై కూడా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అనంతరం గౌతమి శ్వేతను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎన్. వెంకట్ రామ్, డాక్టర్ కె. రాజశేఖర రావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. పవన్ కుమార్, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కె.ఆర్. ప్రసాద్, ఉమెన్ డెవలప్‌మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ కె. రూత్ రమ్య, హాబీ క్లబ్స్ ప్రొఫెసర్ ఇన్‌చార్జి డాక్టర్ ఆర్. శుభాకరరాజు, డాక్టర్ హబీబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


