‘చేనేత సహకార’ ఎన్నికలు నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

‘చేనేత సహకార’ ఎన్నికలు నిర్వహించండి

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

తాడేపల్లి రూరల్‌: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మంగళగిరి పట్టణంలోని మార్కండేయ కల్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం ప్రకటించినప్పటికీ, చేనేత సహకార సంఘాల ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత సహకార సంఘాలకు చివరిసారిగా 2012లో ఎన్నికలు నిర్వహించారని గుర్తుచేశారు. నేటికీ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించడం అన్యాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది సంఘాలు నిర్వీర్యమవుతున్నాయని, కార్మికులకు ఉపాధి కల్పించే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బకాయిలు విడుదల చేయండి

మరోవైపు, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సంఘాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయని తెలిపారు. ఫలితంగా చేనేత కార్మికులకు పనులు లభించక, జీవనోపాధి దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం సంఘాల ఎన్నికల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, చేనేత శాఖ మంత్రి మొదలుకొని స్థానిక శాసనసభ్యుడు, మంత్రి నారా లోకేష్‌ వరకు చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నారని గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో–కన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, కట్టా శివ దుర్గారావు, పిల్లలమర్రి బాలకృష్ణ, కమిటీ సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, కాసుల రవికుమార్‌, బండారు మస్తానరావు, ఉడతా సుబ్రహ్మణ్యం, గజవల్లి వెంకట కృష్ణారావు, డోకుపర్తి రామారావు, కౌతవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement