మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

26న పోలింగ్‌... 30న కౌంటింగ్‌ జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు పొన్నూరు మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్‌ చంద్ర పునేఠ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ స్థానిక కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌, పొన్నూరు మున్సిపాలిటీలకు నవంబర్‌ 26న పోలింగ్‌ , నవంబర్‌ 30న కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు.

గ్రామ పంచాయతీలకు సిద్ధంగా ఉండాలి

కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా అన్ని విధాలుగా సన్నద్ధతతో ఉండాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి క్లస్టర్‌ కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓ), ఇతర పోలింగ్‌ అధికారులు (ఓపీఓ)లకు శిక్షణ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచురించిన ఓటర్ల జాబితాలను వినియోగించాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి మున్సిపల్‌ పరిధి మినహాయించి జిల్లా అంతటా ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని తెలిపారు. మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ, డీఆర్‌ఓ షేక్‌ ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగ సాయికుమార్‌ పాల్గొన్నారు.

భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

అమరావతి రాజధానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ, సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్లు భార్గవ్‌ తేజ, కార్తీక్‌లతో కలసి రాజధాని భూసేకరణపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ–3, ఈ–13, ఈ–15 నుంచి ట్రంక్‌ రోడ్‌ను విస్తరించి ఎన్‌హెచ్‌ 16ను కలిపేందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న అంశాల గురించి చర్చించారు. రెండవ విడత ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూసేకరణ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement