బెజవాడలో రెచ్చిపోయిన మైనర్‌లు | - | Sakshi
Sakshi News home page

బెజవాడలో రెచ్చిపోయిన మైనర్‌లు

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

బెజవాడలో రెచ్చిపోయిన మైనర్‌లు

సెల్‌ఫోన్‌ల కోసం ప్రయాణికులపై కర్రలతో దాడులు

దాడిలో కిందపడి కాళ్లు పోగొట్టుకున్న యువకుడు

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి...

పూర్తిగా లోపించిన ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ నిఘా

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ మైనర్‌లు...

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలులోని ప్రయాణికులనే టార్గెట్‌గా చేసుకుని డోర్‌ల వద్ద కూర్చుని సెల్‌ఫోన్‌లను చూసుకుంటున్న ప్రయాణికులను కర్రలతో చేతులపై కొట్టి ఫోన్‌లు కిందపడగానే తీసుకుని పరారవుతున్న కేసులు విజయవాడ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని అడ్డుకోవాల్సిన ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ రకం దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఇటువంటి దాడిలో ఓ యువకుడు సెల్‌ఫోన్‌తో పాటు కిందపడగా అతని రెండు కాళ్లు రైలు చక్రాల కింద తెగి పడిపోయిన ఘటన జరిగింది. ఈ కేసులో యువకుడిపై సెల్‌ఫోన్‌ కోసం దాడి చేసిన నిందితులు ఇద్దరు మైనర్‌లు కావటం గమనార్హం. ఇదే మైనర్‌లు గంజాయి తరలిస్తూ జీఆర్‌పీ పోలీసులకు పట్టుబడటంతో వారి నేరప్రవృత్తి వెలుగులోకి వచ్చింది.

మైనర్‌ల దాడిలో రెండు కాళ్లు కోల్పోయిన యువకుడు...

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన షేక్‌ మహ్మద్‌ అనే యువకుడు గత నెల 25న స్నేహితునితో కలసి బంధువుల పెళ్ళికి విశాఖపట్నం బయలుదేరారు. రాత్రి 7.50 గంటల సమయంలో 17482 బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని జనరల్‌ కోచ్‌ ఎక్కాడు. రద్దీగా ఉండటంతో డోర్‌ వద్ద కూర్చుని సెల్‌ఫోన్‌ చూసుకుంటున్నాడు. రైలు పది నిమిషాల తరువాత బుడమేరు వద్దకు చేరుకున్న సమయంలో కింద నుంచి గుర్తు తెలియని వ్యక్తి కర్రతో అతని చేతుల మీద కొట్టగా సెల్‌ఫోన్‌తో పాటు అతను కూడా కింద పట్టాల మీద పడిపోగా అతని రెండు కాళ్లు రైలు చక్రాల కిందకు వెళ్లి తెగి పడిపోయాయి. ఇద్దరు నిందితులు పడిపోయిన సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యారు. బాధితుడిని గుర్తించిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. దీనిపై ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు జీఆర్‌పీ పోలీసులు వెళ్లి బాధితుని వివరాలు నమోదు చేసుకుని కేసు నమోదు చేశారు.

గత నెల 29న విజయవాడ రైల్వేస్టేషన్‌లో రైలులో గంజాయి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా జీఆర్‌పీ పోలీసులు న్యూఆర్‌ఆర్‌ పేట, నూజివీడుకు చెందిన ఇద్దరు మైనర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,10,000 విలువ చేసే 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయితో పాటు గతంలో వారు చేసిన పలు నేరాల చరిత్రను కూడా పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్‌ కోసం యువకుడిపై కర్రతో దాడి చేసింది కూడా తామేనని ఒప్పుకోవడంతో పోలీసులు వారి నుంచి దోచుకున్న సెల్‌ఫోన్‌ను కూడా రికవరీ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement