నరసరావుపేట: డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో వాహనాలు నడపుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్‌టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి టి.అజితకుమారి పేర్కొన్నారు. స్థానిక ఏపీఎస్ ఆర్‌టీసీ డిపోలో నిర్వహిస్తున్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌లో 26వ బ్యాచ్ అభ్యర్ధులకు శిక్షణా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ తీసుకున్న డ్రైవర్లకు సర్టిఫికేట్లు అందజేసే కార్యక్రమానికి ఆమె హాజరై సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్, డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో 27వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. శిక్షణ తీసుకొనదలచిన డ్రైవర్లు 959225428, 7382896150 నంబర్లను సంప్రదించాలని కోరారు. డ్రైవింగ్ ఇనస్పెక్టర్ షేక్ సుభాని, రిటైర్డు ఇనస్పెక్టర్ సీహెచ్.మోహనరెడ్డి పాల్గొన్నారు.


