అనుమతులిచ్చి చేతులు దులుపుకొంటారా...?
పట్నంబజారు: దీపావళి పండుగ వచ్చిందంటే గుంటూరు నగరంలో బాణసంచా దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తాయి. వ్యాపారులకు పండుగ ఆదాయంపై ఆశ.. వినియోగదారులకు టపాసుల కొనుగోళ్లపై ఆసక్తి. కానీ ఈ సందడి వెనుక పొంచి ఉన్న ప్రమాదాలను మాత్రం విస్మరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే చిన్న నిర్లక్ష్యమే పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చింది.
అనుమతులన్నీ ఆన్లైన్లోనే..
గతంలో అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు అమల్లోకి తెచ్చిన పలు ఆంక్షల నేపథ్యంలో, పండుగ సమీపిస్తున్న తరుణంలో అనుమతుల ప్రక్రియ హడావుడిగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియలో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దరఖాస్తుదారులు సంబంధిత శాఖలు కోరిన వివరాలు, ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ), పోలీస్ శాఖ అనుమతి, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపు రసీదు, దుకాణం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించిన యాజమాన్య పత్రాలు, రెవెన్యూ శాఖ అనుమతి వంటి అంశాలు ఇందులో కీలకం. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాతే అనుమతుల ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తు సమర్పించడం అనేది అనుమతి పొందినట్లుగా భావించకూడదు. అన్ని శాఖల నిబంధనలు పూర్తిచేసిన తర్వాతే విక్రయాలకు అనుమతి లభిస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ ప్రక్రియ కోసమే గుంటూరు కార్పొరేషన్లో సింగిల్ విండో పర్మిషన్ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానం నేపథ్యంలో ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించే అవకాశాలు లేకపోలేదనే విమర్శలు ఉన్నాయి. అసలే ఎన్నికలు, కౌంటింగ్ పనుల్లో నిమగ్నమైన అధికారులు వీటన్నింటినీ ఎలా పర్యవేక్షిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వాట్సాప్ ద్వారా అగ్నిమాపక శాఖ సేవలు
బాణసంచా దుకాణాలకు సంబంధించి అగ్నిమాపక శాఖ సేవలను కూడా డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 94412 36448 వాట్సాప్ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు సమాచారం వెల్లడిస్తోంది. ఈ సేవ ద్వారా అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిఫారసుల ప్రక్రియను సులభతరం చేశామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆన్లైన్ ఇబ్బందులు తలెత్తడంతోపాటు, కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయని తెలుస్తోంది. దీంతో గతంలో మాదిరిగా అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించలేని పరిస్థితి ఏర్పడుతుందని సమాచారం.
ఎక్కడపడితే అక్కడ దుకాణాలా?
నగరంలో వ్యాపారానికి అనువుగా ఉందని ఎక్కడపడితే అక్కడ బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వీల్లేదు. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలు, నివాస సముదాయాలు, రద్దీ కూడళ్లు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటుపై నిబంధనల ప్రకారం నియంత్రణ ఉండాలి. స్థలానికి సంబంధించిన పత్రాలను పరిశీలించడంతోపాటు, వాస్తవ పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలి. అనుమతి పొందిన స్థలాన్ని మార్చి మరోచోట విక్రయాలు సాగిస్తే చర్యలు తీసుకోవాలి. స్థల ఎంపికలో నిర్లక్ష్యం జరిగితే దాని ప్రభావం వ్యాపారులపైనే కాకుండా చుట్టుపక్కల ప్రజలపైనా పడుతుంది.
భద్రతా ప్రమాణాలు గాలికి..
బాణసంచా దుకాణాల నిర్వహణలో అగ్నిమాపక భద్రత కీలకం. ప్రతి దుకాణం వద్ద తాగునీరు, ఇసుక, పనిచేసే స్థితిలో ఉన్న అగ్నిమాపక పరికరాలు ఉండాలి. విద్యుత్ వైర్లలో లోపాలు లేకుండా చూడాలి. ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు తగిన మార్గాలు ఉండాలి. దుకాణాల వద్ద అనవసరంగా రద్దీ పెరగకుండా చర్యలు తీసుకోవాలి. నిల్వ, విక్రయాల విషయంలో అనుమతించిన పరిమితులను ఉల్లంఘించకూడదు. ఇవన్నీ కేవలం కాగితాలపైనే చూపించే ఏర్పాట్లుగా మిగిలిపోకుండా అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలి.
అనుమతుల జారీలో హడావుడి..
భద్రతా తనిఖీల్లో అలసత్వం
నిబంధనలు ఉల్లంఘిస్తే
ప్రజల ప్రాణాలకే ముప్పు
ఫైర్ ఎన్ఓసీ, పోలీస్ క్లియరెన్స్,
రెవెన్యూ ధ్రువీకరణ తప్పనిసరి
దుకాణాల ఏర్పాటుపై
నిరంతర నిఘా శూన్యం
ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడం, ధ్రువపత్రాలు పరిశీలించడం, అనుమతులు జారీ చేయడంతోనే అధికారుల బాధ్యత ముగిసిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాలు ప్రారంభమైనప్పటి నుంచి విక్రయాలు ముగిసే వరకు పర్యవేక్షణ ఉండాలి. అగ్నిమాపక శాఖ భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలి. పోలీస్ శాఖ ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలి. రెవెన్యూ అధికారులు స్థలానికి సంబంధించిన అనుమతులను పరిశీలించాలి. నగరపాలక సంస్థ అధికారులు పారిశుద్ధ్యం, ప్రజల రాకపోకలు, పరిసరాల భద్రతపై దృష్టి పెట్టాలి. శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఆన్లైన్ విధానం కూడా ఆశించిన ఫలితాలను సాధించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


