గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

గురువారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం ఆర్టీసీపై తుఫాన్‌ ప్రభావం గుంటూరు నగర వాసులకు ఇక్కట్లు

న్యూస్‌రీల్‌

జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు స్తంభించిన జనజీవనం ప్రాథమికంగా 23,860 ఎకరాల్లో పంటలకు నష్టం దెబ్బతిన్న వరి, పత్తి, మినుము, ఉద్యాన పంటలు ఈదురుగాలులకు నేలకొరిగిన భారీ చెట్లు పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం

గురువారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
అర్నబ్‌ దెబ్బకు

I

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.4 వేలు, గరిష్ఠ ధర రూ.6 వేలు, మోడల్‌ ధర రూ.5 వేల వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.4110 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌) : తుఫాన్‌ నేపథ్యంలో ఆర్టీసీ గుంటూరు రీజియన్‌లో బుధవారం పలు సర్వీసులు రద్దు చేశారు. దీంతో సంస్థ ఆదాయానికి నష్టం వాటిల్లింది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

23,860 ఎకరాల్లో పంటలకు నష్టం..

జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పెదకాకాని, గుంటూరు తూర్పు, తెనాలి, వట్టిచెరుకూరు, మంగళగిరి, తుళ్లూరు, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు పశ్చిమ, తాడేపల్లి.. మొత్తం 11 మండలాల్లోని 69 గ్రామాల్లో 9,889 మంది రైతులకు చెందిన 22,997.5 ఎకరాల్లో వరి, మినుము, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే అరటి, కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటలు 862.5 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మొత్తం కలిపి 23,860 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

దిగుబడులపై దిగులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటల దిగుబడులు తగ్గుతాయేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ఈదురుగాలులకు పంటలు నేలవాలింది. మినుము పంట నీట మునిగింది. పత్తి పంట పలు చోట్ల పూత, పిందె, కాయ, ఏరే దశలో ఉంది. ఏరే దశలో ఉన్న పత్తి పంటకు నష్టం వాటిల్లింది. కాయ దశలో ఉన్న పత్తి పంటలో నీరు చేరడంతో రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కొనసాగితే పంట నష్టాలు పెరుగుతాయని భయపడుతున్నారు.

పొంగిపొర్లుతున్న వాగులు

వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలుల ధాటికి అక్కడక్కడా భారీ చెట్లు నేలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

41 మి.మీ. సగటు వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 77.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 12.4 మి.మీ. నమోదైంది. జిల్లాలో సగటున 41 మి.మీ.గా కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 71.2, చేబ్రోలులో 70, మంగళగిరిలో 66.6, కొల్లిపరలో 66.6, తెనాలిలో 63.8 , పెదకాకానిలో 50.8 , గుంటూరు తూర్పులో 38.4, గుంటూరు పశ్చిమలో 38.2, తాడికొండలో 36 , తుళ్లూరులో 31.8, పొన్నూరులో 24.5, కాకుమానులో 21.6, మేడికొండూరులో 18.6, వట్టిచెరుకూరులో 17.4, పెదనందిపాడులో 16.2, ప్రత్తిపాడు మండలంలో 15.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.

రాజధాని ప్రాంతంలో దెబ్బతిన్న పంటలు

అర్నబ్‌ దెబ్బకు పత్తి, జూట్‌, వరి తదితర పంటలు నేలవాలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదపరిమి–తాడికొండ మధ్య రోడ్డు నిర్మాణంలో భాగంగా తవ్వి వదిలేయడంతో భారీ గుంతల్లో నీరు నిలిచిపోయింది. పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాజధానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు సైతం రోడ్డుపై వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో నానా అవస్థలు పడ్డారు. పెదపరిమి–నెక్కల్లు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్‌ చప్టా పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాడికొండ మండలం లాం గ్రామం వద్ద లోలెవల్‌ చప్టాపై కొండవీటి వాగు వరద ఉధృతిని పరిశీలించేందుకు జేసీ అశుతోష్‌ శ్రీవాస్తవ వచ్చి అధికారులకు పలు సూచనలు చేశారు. పూడికతీత పనులు చేయించారు. జిల్లాలో వర్షం కురుస్తూనే ఉంది. తుళ్లూరు మండలంలోని లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు పాఠశాలలను పరిశీలించి సిద్ధం చేశారు.

పరిహారం ఎప్పుడో?

గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుఫాన్‌ కారణంగా 6,062.21 ఎకరాల్లో పంటలు నష్టపోయిన 3,800 మంది రైతులకు రూ.5.75 కోట్ల నష్టపరిహారం నేటికీ అందలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. గత నష్టాలకే పరిహారం అందని పరిస్థితుల్లో మరోసారి తుఫాన్‌ ప్రభావం తమను ఆర్థికంగా దెబ్బతీస్తోందని రైతులు వాపోతున్నారు. దుగ్గిరాల పరిధి సీతానగరం దగ్గర సాగుకు నీటి విడుదల నిలిపివేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

తుఫాన్‌ ప్రభావంతో గుంటూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన వారు మోకాలి లోతు నీటిలోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. మూడు వంతెనలు, చుట్టుగుంట మురికిపేట, పీకల వాగు, కంకరగుంట ఆర్‌యూబీ, టీజేపీఎస్‌ కాలేజీ ఎదురుగా, ఐటీసీ రోడ్డు, జేకేసీ కాలేజీ రోడ్డు, పట్టాభిపురం మెయిన్‌ రోడ్డు, అమరావతి రోడ్డు, రామిరెడ్డితోట, గుంటూరువారితోట, పాత గుంటూరు, నందివెలుగు రోడ్డుతో పాటు కొత్తపేట, నెహ్రూనగర్‌, బొంగరాలబీడు, విద్యానగర్‌, బ్రాడీపేట, అరండల్‌పేట తదితర ప్రాంతాల్లోని లోతట్టు వీధులు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement