బూత్ ఏజెంట్లకు టీడీపీ బెదిరింపులు పోలింగ్ కేంద్రాలకు రావొద్దంటూ హుకుం వచ్చినా మౌనంగా లేకుంటే అక్రమ కేసులేనని హెచ్చరిక బీఎల్‌ఓలతో కలిసి తిరుగుతున్న బీఎల్‌ఏల తీరుపైనా అనుమానాలు ఫిర్యాదులు వస్తున్నా కనీసం స్పందించని అధికారులు
బీఎల్‌ఓతో కలిసి తిరుగుతున్నారెందుకు?
పట్నంబజారు: కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార కూటమి పార్టీ నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాల్సిన వేళ బూత్ స్థాయిలోనే ఒత్తిళ్లు, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి సంబంధించిన బూత్ స్థాయి ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలింగ్ రోజున బూత్‌కు రావద్దని, వచ్చినా చూసీచూడనట్లు వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాట వినకపోతే అక్రమ కేసులు నమోదు చేయిస్తామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితులు కలకలం రేపుతున్నాయి.
బూత్ స్థాయిలోనే కుట్ర
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారే పరిస్థితుల్లో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. ఓటర్ల జాబితా పరిశీలన, లోపాలు గుర్తించడం, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్ల వివరాలను గుర్తించడంలో బీఎల్‌ఏలు బూత్ స్థాయి అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం శిక్షణ మార్గదర్శకాల్లోనూ బీఎల్‌ఏలు బూత్ స్థాయి అధికారులతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది.
చూసీచూడనట్లు ఉంటేనే...
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు... బీఎల్‌ఏలను సంప్రదించి పోలింగ్ కేంద్రాలకు హాజరు కావొద్దని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పాతగుంటూరులో సోమవారం రాత్రి ఒక బీఎల్‌ఏ ఇంటికి వెళ్లి మరీ వారు బెదిరించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో బూత్‌లకు రాకూడదని, వచ్చినా.. అక్కడ జరిగే వ్యవహారాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ మాట వినకపోతే పోలీసు కేసులు, ఇతర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారని సమాచారం.
స్లిప్పుల పంపిణీపై కూడా స్పష్టత ఏది?
ఆయా డివిజన్‌లో టీడీపీ బీఎల్‌ఏలతో కలిసి బీఎల్‌ఓలు కేవలం అధికార పార్టీ నేతలకు మాత్రమే స్లిప్పులు ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అయితే అసలు ఓట్లు లేవని చెబుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బీఎల్‌ఓలు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ఒకవైపు వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏలను బెదిరిస్తున్నారనే ఆరోపణలు.. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా బూత్ స్థాయి అధికారులు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే ఎన్నికల యంత్రాంగం తక్షణమే విచారణ చేపట్టాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తోంది.
కీలక నేతల ‘హుకుం’
ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార కూటమిలోని కొందరు కీలక నేతల ప్రమేయం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే ఆయా డివిజన్‌లలోని ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు ద్వారా బీఎల్‌ఏలకు ఫోన్లు చేయించడం, వ్యక్తిగతంగా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోందని అంటున్నారు. కనీసం ఇళ్ల దగ్గరికి వెళ్లి బెదిరిస్తున్నారని తెలిసినప్పటీకీ.. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు మౌనం ఎందుకు?
ఎన్నికల సమయంలో ప్రతి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉంటుంది. ముఖ్యంగా బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రాథమిక సూత్రం. బీఎల్‌ఏలను బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే విచారణ జరగాలి. అలాగే బీఎల్‌ఓలు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వస్తే వాస్తవాలను నిర్ధారించాలి. బీఎల్‌ఓలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
గుంటూరు నగరంలో టీడీపీ నేతలకు బీఎల్‌ఓలు ఊడిగం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బూత్ స్థాయి అధికారులు, అధికార కూటమికి చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు కలిసి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో ప్రభుత్వ ఎన్నికల యంత్రాంగానికి చెందిన అధికారి, టీడీపీకి చెందిన స్థానిక డివిజన్ నేతలు, టీడీపీ బీఎస్‌ఏలు కలిసి ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థులే కాకుండా, స్వతంత్య్ర, జనసేన అభ్యర్థులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బూత్ స్థాయి అధికారి ప్రభుత్వ ఎన్నికల వ్యవస్థలో అధికారిక బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి. ఓటర్ల జాబితా పరిశీలన, ఇంటింటి పరిశీలన, మారిన / మరణించిన ఓటర్ల వివరాల గుర్తింపు వంటి బాధ్యతలు వారికి ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు పనిచేస్తూ.. ఆయా డివిజన్‌లలో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు.


