ఏసీ కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన నగర కమిషనర్ ఓటు హక్కు వినియోగించుకున్న 807 మంది ఉద్యోగులు
నెహ్రూనగర్: ఎన్నికల విధులు కేటాయించిన 807 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో 27, 28 తేదీల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండాపోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేలా చూడాలని అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్‌లను నిబంధనల ప్రకారం పక్కాగా సీలింగ్ చేసి, స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచడంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పారు. 27న 367 మంది, 28న 440 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఐ. కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి. సాంబశివరావు, బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


