తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: అర్నాబ్‌ తుఫాన్‌ పట్ల క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులకు భరోసా కల్పించాలన్నారు. దుగ్గిరాల, మంగళగిరి, చేబ్రోలు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యిందన్నారు. ఆయా ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. గాలుల వేగం ఎక్కువగా ఉందని, దీనివల్ల స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. దుగ్గిరాల మండలం ఈమని వద్ద కూలిన చెట్టును ఇప్పటికే తొలగించారని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ ఇతర చానళ్లలో ప్రవాహాన్ని అధికారులు గమనించాలన్నారు. యానాది కుటుంబాలను పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలించామన్నారు. వాగులు, వంకలు, చెరువులు, నదుల వద్దకు ఎవరూ వెళ్లకూడదని చెప్పారు.

నేడు భీకర గాలులు వీచే అవకాశం

అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో భీకర గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీజీఎస్‌ సూచనల మేరకు గురువారం ఉదయం వరకు భీకర గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు. పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని, అయితే పాఠశాల భవనాల పరిస్థితిని గమనించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఇప్పటి వరకు పెద్దగా ఆస్తి నష్టం జరగలేదన్నారు. తెనాలిలో గోడ కూలి బాలుడు మృతి చెందడం మినహా ఎక్కడా ప్రాణహాని జరగలేదన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుళ్లూరు మండలం కోటెల్ల వాగు వద్ద రాకపోకలను నియంత్రించేందుకు సిబ్బంది ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని గురువారం ఉదయం వరకు కొనసాగించాలని, అవసరమైతే మధ్యాహ్నం వరకు కేంద్రాల్లోనే ఉంచాలని తెలిపారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లు, పాఠశాల భవనాలను గుర్తించాలని, వాటిలో ఎవరూ నివసించకుండా చూడాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూమ్‌లు యథావిధిగా కొనసాగాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 08632234014 నంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. హోర్డింగులు, ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో జీఎంసీ కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

5న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్‌ 5వ తేదీన పోలింగ్‌, 7న లెక్కింపు జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభవుతుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement