పట్నంబజారు: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాలు.. నెహ్రూనగర్‌లో నివాసం ఉండే సౌపాటి రాంబాబు ఆటోనగర్‌లోని మహేంద్ర షోరూమ్‌లో వెహికల్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన రాంబాబు 12 ఏళ్ల క్రితం పద్మజను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య మృతి చెందడంతో బ్రాహ్మణకోడూరుకు చెందిన మరో మహిళ మేరిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పద్మజకు సాత్విక్(10), నిత్య(8) పిల్లలు ఉన్నారు. దసరాకు బంధువుల ఇంటికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు తిరిగి ఆ మరుసటి రోజు ఇంటికి వచ్చారు. ఈక్రమంలో సవతి తల్లి మేరి ఇద్దరు చిన్నారులకు బిర్యానీ వండి పెట్టడం, మరుసటి రోజే దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో జరిగిన భోజనాలను చిన్నారులు తిన్నారు. ఆహారం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఆర్‌ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తుండగా, శనివారం చిన్నారి సాత్విక్, నిత్య మృతి చెందారు. చిన్నారుల మృతిపై తనకు అనుమానం ఉందని, పద్మజ సోదరుడు పాపన సాయిరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సవతి తల్లి ఏదైనా చేసి ఉంటుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు ఐదురోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


