ఘనంగా ఏపీఎస్‌పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఏపీఎస్‌పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

స్టేట్‌ మీట్‌ నిర్వహణ అభినందనీయం హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ ముగిసిన నాలుగు రోజుల స్టేట్‌ లెవల్‌ స్పోర్ట్స్‌ మీట్‌

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏపీఎస్‌పీఎఫ్‌ స్టేట్‌మీట్‌– 2026 నిర్వహించడం అభినందనీయమని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 4 రోజుల పాటు నిర్వహించిన ఏపీఎస్‌పీఎఫ్‌ స్టేట్‌ లెవల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గన్నవరం సమీపంలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరితగతిన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి పంపిన బడ్జెట్‌ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఏపీఎస్‌పీఎఫ్‌ పోలీస్‌ అధికారుల డెప్యుటేషన్‌ కోటాను రద్దు చేయడం ద్వారా సంస్థలోని అధికారులకు త్వరితగతిన పదోన్నతులు లభించేందుకు మార్గం సుగమమైందని వివరించారు. ఏపీఎస్‌పీఎఫ్‌ ఇన్‌న్‌స్పెక్టర్‌ జనరల్‌ బీవీ రామిరెడ్డి మాట్లాడుతూ ఏపీఎస్‌పీఎఫ్‌ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి చొరవతో ఎఫ్‌పీఎఫ్‌ ప్రతిపాదనలు త్వరితగతిన పరిష్కారమయ్యాయన్నారు. అందులో భాగంగా 1998 బ్యాచ్‌కు చెందిన 248 మంది కానిస్టేబుళ్లను, 2000 బ్యాచ్‌కు చెందిన 373 మంది కానిస్టేబుళ్లను హెడ్‌ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ స్థానంలో ఏపీఎస్‌పీఎఫ్‌ సిబ్బందిని దశలవారీగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. మొదటి దశలో ఇప్పటికే 75 మందిని నియమించినట్లు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో తిరుపతి, విజయవాడ, రాజమండ్రి జోన్లకు చెందిన సుమారు 172 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్‌, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షాట్‌ఫ/ట్‌ తదితర క్రీడల్లో తమ ప్రతిభను చాటారు. విజేతలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌, హోంశాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయ్‌ కుమార్‌, ఇన్‌న్‌స్పెక్టర్‌ జనరల్‌ బీవీ రామిరెడ్డి, విజయవాడ జోన్‌ కమాండెంట్‌ ముద్దాడ శంకరరావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ముందుగా క్రీడాకారులచే క్రీడా గౌరవ వందనం స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement