వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను అనధికారికంగా వాట్సాప్ ద్వారా పంపడంపై తీవ్ర దుమారం ‘సాక్షి’ కథనంతో కదిలిన యంత్రాంగం.. కౌన్సిల్ క్లర్క్ సస్పెన్షన్, సిటీ ప్లానర్‌కు షోకాజ్ టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ‘డీసీ’ పాత్రపై కార్పొరేషన్‌లో జోరుగా గుసగుసలు అధికార పార్టీ అండతోనే ఉన్నతాధికారికి రక్షణ పోలీస్ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని మిత్రపక్షం జనసేన డిమాండ్
నెహ్రూనగర్: నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల రిజర్వేషన్ల జాబితా(ప్రియాంబుల్ కాపీ) లీకేజీ వ్యవహారం అధికార యంత్రాంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అధికారుల పచ్చపాతం’ ప్రత్యేక కథనం నగరపాలక సంస్థ వర్గాల్లో భారీ ప్రకంపనలు సృష్టించింది. అధికారికంగా బహిర్గతం కావాల్సిన జాబితాను టీడీపీ నేతలకు, అనుకూల మీడియా వర్గాలకు వాట్సాప్ ద్వారా చేరవేయడంపై జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, నగర కమిషనర్ మయూర్ అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఉన్నతాధికారులు.. ప్రాథమిక విచారణ పేరుతో కౌన్సిల్ గుమస్తా అడపా నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సిటీ ప్లానర్ రాంబాబుకు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే, ఈ తతంగమంతా కేవలం అసలు సూత్రధారులను కాపాడేందుకేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పోలీస్ విచారణ జరపాల్సిందే–
జనసేన ఆగ్రహం
ఈ ఉదంతంపై మిత్రపక్షమైన జనసేన నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అధికారిక పత్రాలను, కలెక్టర్ సంతకంతో కూడిన కాపీలను స్వార్థ ప్రయోజనాల కోసం ముందే బయటకు పంపడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ లీకేజీ వ్యవహారంపై కేవలం శాఖాపరమైన నామమాత్రపు విచారణతో సరిపెట్టకుండా, సైబర్ క్రైమ్ లేదా పోలీస్ కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ నంబర్ల నుంచి డాక్యుమెంట్లు చేతులు మారాయో డిజిటల్ ఆధారాలు సేకరిస్తే అసలు నిందితుడైన డీసీ గుట్టు రట్టవుతుందని, ఎన్నికల నియమావళి ప్రకారం బాధ్యులైన అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పట్టుబడుతున్నారు.


