● బీరువాలోని రూ.14 వేలు మాయం
చేసిన దుండగుడు
● సీసీఎస్ స్టేషన్ పక్కన ఆలయ
హుండీల్లోని రూ.40 వేలూ చోరీ
లక్ష్మీపురం (గుంటూరు పశ్చిమ): పోక్సో కోర్టులో దుండగుడు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని పోక్సో కోర్టు ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ప్రధాన ద్వారానికి వేసిన తాళాలను పగలగొట్టాడు. బీరువాలో ఉన్న సుమారు రూ.14 వేల నగదు ఎత్తుకెళ్లాడు. బుధవారం ఉదయం రోజు లాగానే కోర్టు తలుపులు తీసేందుకు వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టి ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని సంబంధిత న్యాయాధికారులకు తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం సీఐ రాజేష్ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లు పోక్సో కోర్టు వద్దకు చేరుకుని కీలక ఆధారాలను సేకరించాయి. ఈ విషయం పోక్సో కోర్టు సంబంధిత అధికారులు... జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సమాచారం ఇచ్చారు. చోరీ చేసిన వ్యక్తి దొంగతనం కోసం వచ్చాడా, లేక ఏదైనా రికార్డుల కోసం వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీర్లంకమ్మ గుడిలో..
గుంటూరు జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్ (క్రైం)కు ఆనుకుని ఉన్న వీర్లంకమ్మ వారి దేవాలయంలో ప్రతిరోజూ పూజలు నిర్వహించి, రాత్రి బయట భాగంలో ఉన్న ఇనుప గ్రిల్స్‌కు నిర్వాహకులు, అర్చకులు రెండు తాళాలు వేసి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి అమ్మవారి దేవాలయం తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. చిన్న స్టీల్ హుండీలను పగలగొట్టి నగదు తీసుకుని, అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉన్న పెద్ద హుండీని భుజాన పెట్టుకుని సీసీఎస్ పోలీస్ స్టేషన్ మీదుగా రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. అక్కడ పెద్ద హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును తీసుకున్నాడు. హుండీని సీసీఎస్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఎఫ్‌ఎస్‌ఎల్ (ఫోరెన్సిక్ ల్యాబ్) వద్దనే వదిలేసి వెళ్లాడు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఈ విషయం గమనించారు. హుండీ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సుమారు రూ.40 వేల నగదును తీసుకుని దుండగుడు పరారై ఉంటాడని వారు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు, క్లూస్ టీం సభ్యులు ఆధారాలను సేకరించారు.


