వైఎస్సార్‌సీపీ హయాంలో పోస్టులు మంజూరు
ఉమ్మడి ఏపీలో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్‌లో సమస్యలు ఏకరువు పెడుతున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది కొరతతో రోగులు సేవలు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపీ అనే వ్యక్తి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆసుపత్రిలో వైద్యసౌకర్యాల దుస్థితిని కళ్లకు కట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో వైద్య పరికరం ప్రారంభానికి వచ్చారు. ఆయన పర్యటన నేపథ్యంలోనూ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇకనైనా తమ ఇబ్బందులు తీర్చాలని రోగులు వేడుకుంటున్నారు.
సాక్షిప్రతినిధి, గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌కు సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు ప్రతిరోజూ మూడు వేల నుంచి నాలుగు వేల మంది వస్తున్నారు. ఆసుపత్రిలో సుమారు 1,250 పడకలు ఉండగా, చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య రెండు వేల వరకు ఉంటుంది. పడకలు, రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది ఆసుపత్రిలో లేకపోవటంతో వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. వైద్యుల పోస్టుల్లో ప్రొఫెసర్లు 74 కాగా 18 ఖాళీలు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 68 కాగా 18, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 231 కాగా 30, మెడికల్ ఆఫీసర్లు 49 కాగా 19, సీనియర్ రెసిడెంట్లు 104 కాగా 50 ఖాళీలు ఉన్నాయి.
సిబ్బంది కూడా తక్కువే...
ఆసుపత్రిలో వైద్యుల తరువాత వైద్యసేవల్లో కీలక పాత్ర పోషించే నర్సుల పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. 688 పోస్టులకు గాను 56 ఖాళీలు ఉన్నాయి. పారామెడికల్ సిబ్బంది పోస్టులు 216కు గాను 59 ఖాళీలు ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల కొరత వల్ల రోగులను వారి సహాయకులే వీల్‌చైర్లు, స్ట్రెచర్లపై తీసుకెళ్లాల్సిన దుస్థితి.
పరికరాల పనితీరు అంతంతే..
అత్యవసర వైద్యసేవల విభాగంలోని సీటీ స్కాన్ వైద్య పరికరం ఏడాదిగా మూలన పడింది. ప్రస్తుతం ఉన్న సీటీ స్కాన్ వైద్య పరికరం తరచుగా రిపేర్లకు గురవుతోంది. ఎంఆర్‌ఐ స్కాన్ మెషిన్‌ను పీపీపీ విధానంలో ఆసుపత్రిలో ఉంచారు. అక్కడ ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించుకోవాలంటే వారాల తరబడి వేచి ఉండాలి. ఈ ఏడాది జనవరిలో రూ.100 కోట్లతో నిర్మించి నూతనంగా ప్రారంభించిన ఎంసీహెచ్ వార్డులో పలు వైద్య పరికరాలు వినియోగంలోకి రాకుండా మూలన పడేశారు. పడకల సంఖ్యకు తగినట్టు వైద్యులు, వైద్య సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం
అత్యవసర సేవల విభాగంలో రోగి సహాయకులతో చికిత్సకు వినియోగించే సర్జికల్ ట్రే క్లీనింగ్ చేయించిన విషయం వైరల్‌గా మారడంతో జిల్లా అధికారులు చర్యలకు ఆదేశించారు. గర్భిణులకూ వీల్‌చైర్ ఇవ్వకుండా, స్కానింగ్ కేంద్రానికి తీసుకెళ్లని నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమయపాలన ఏదీ?
సీనియర్ వైద్యులు కొంతమంది సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు సీనియర్ వైద్యులు మధ్యాహ్నం కల్లా సొంత క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంతమంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్ వేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా జూనియర్ వైద్యులతోనే రోగులకు ఓపీ సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం నుంచి బెడ్‌సైడ్ టీచింగ్ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. వైద్య విద్యార్థులు నష్టపోతున్నారు.
మామూళ్ల రోగం
జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే, తమ చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలంటే అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి మగబిడ్డకు ఒక రేటు, ఆడబిడ్డకు మరో రేటు చొప్పున మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో కూడా వసూలు చేస్తారు. మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రివేళల్లో అందుబాటులో ఉండటం లేదు. పరిపాలనా కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా మామూళ్లు తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో వేచిచూస్తున్న రోగులు (ఫైల్)
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనపు మెడికల్ యూనిట్స్ మంజూరు చేసి, నూతన వైద్య విభాగాలు, నూతనంగా పోస్టులు మంజూరు చేశారు. పేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ వైద్య విభాగాలను నూతనంగా మంజూరు చేశారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం న్యూరోసర్జరీ, యూరాలజీ వైద్య విభాగాల్లో అదనపు మెడికల్ యూనిట్లు మంజూరు చేశారు. వైద్య కళాశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 35 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టులు మంజూరు చేశారు. ఖాళీగా ఉన్న 32 పారామెడికల్ పోస్టులు భర్తీ చేశారు. ఆ తర్వాత గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలలో పోస్టుల మంజూరు, ఖాళీల భర్తీ చేపట్టక పోవటంతో రోగులు సకాలంలో తగిన వైద్య సేవలు పొందేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.


