సచివాలయ ఉద్యోగులను హెచ్చరించిన పోలీసులు విజయవాడ నుంచి పెదకాకాని పోలీసు స్టేషన్‌కు తరలింపు 74 మంది ఉద్యోగులను స్టేషన్‌లో నిర్బంధించిన పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకుని వ్యక్తిగత విచారణ తామేం నేరస్తులం కాదని ఉద్యోగుల ఆవేదన
పెదకాకాని: సమస్యల పరిష్కారం కోరుతూ రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, వినతిపత్రాలు అందజేసినా పరిష్కారానికి నోచుకోలేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బయలుదేరారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం విజయవాడ బస్టాండ్, కృష్ణలంక పోలీసుస్టేషన్ ప్రాంతాల్లో కనిపించిన ఉద్యోగులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. ధర్నాలో పాల్గొనేందుకు వెళుతున్న సుమారు 74 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు వారందరినీ పెదకాకాని పోలీసుస్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. పోలీసులు వారి వద్ద ఉన్న ఫోన్లు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి వివరాలు సేకరించారు. ఒక దశలో ‘‘మేం కూడా ఉద్యోగులమే.. నేరస్తులం కాదు. దూర ప్రాంతాల నుంచి వచ్చాం. తిరిగి వెళ్లేందుకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలి. కనీసం ఫోన్లు ఇవ్వండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు ఇవ్వకపోవడంతో వారు భోజనం చేసేందుకు కూడా నిరాకరించారు. అనంతరం వారితో మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడి, శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని, సహకరించాలని వారితో చర్చించడంతో భోజనం చేశారు. ఒక దశలో ఎక్కువ మాట్లాడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారని సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. పెదకాకాని పోలీసుస్టేషన్‌కు తరలించిన వారిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నంద్యాల, పల్నాడు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. విజయవాడ ధర్నా ముగిసిన తరువాత వారందరినీ వదిలిపెట్టారు.
ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా?
సచివాలయ ఉద్యోగులు శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలియజేసేందుకు వస్తే అదుపులోకి తీసుకోవడం దుర్మార్గపు చర్య అని గుంటూరు జిల్లా సీఐటీయూ కార్యదర్శి నన్నపనేని శివాజీ అన్నారు. మారిన చంద్రబాబు నాయుడిని అంటూ ఉద్యోగులను నమ్మబలికి ఓట్లు వేయించుకుని, సమస్యలపై ప్రశ్నిస్తే గొంతులు నొక్కేస్తున్నారన్నారు. విజయవాడ బస్టాండ్‌లో బస్సులు దిగుతున్న వారిని, రోడ్లపై వెళుతున్న వారిని సైతం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడం బాధాకరమన్నారు. శాఖాపరమైన సమస్యల పరిష్కారం కోసం విజయవాడ బయలుదేరితే వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నేరస్తుల మాదిరిగా సెల్‌ఫోన్లు తీసుకోవడం, మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వేధింపులకు గురిచేస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ పోరాటంలో సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. అలానే పొన్నూరు సీపీఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ పోలీసుస్టేషన్‌లో ఉన్న సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి, వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులను తీసుకొచ్చిన సమయంలో పెదకాకాని పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ మురళీకృష్ణ, లాలాపేట సీఐ శివప్రసాద్, పాతగుంటూరు సీఐ వెంకటప్రసాద్, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.


