తెనాలి: కెనడాలో ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు జరిగిన పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెనాలిలోని కేవీఐకే జిమ్ అండ్ కేవీఐకే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభతో పతకాలను సాధించారు. అకాడమీ క్రీడాకారిణులు బొల్లు లిఖిత 76 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించగా, మదిర షానూన్ 47 కిలోల విభాగంలో రజత పతకం గెలిచారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టర్, కోచ్ ఘట్టమనేని సాయిరేవతి ఆధ్వర్యంలో వీరు శిక్షణ తీసుకున్నారు. క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలియజేశారు.
కొరిటెపాడు(గుంటూరు): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు సోమవారం నుంచి మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఏఐయూబీఓసీ) నాయకులు బత్తిని అర్జున్, ఎం.ఎం.భాస్కరరావులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, అన్ని బ్యాంకుల్లో ఏకరీతి లాభాల ఆధారిత ప్రోత్సాహక విధానం, ఉద్యోగులు, అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపులు నివారించడం తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
ఏటీఎం చార్జీలు మాఫీ
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సమ్మె నేపథ్యంలో వినియోగదారులకు నిర్దేశించిన ఉచిత పరిమితికి మించి ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. వీటికి ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయబోమని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్.మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ చర్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించనుందన్నారు.
రేపల్లె: చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరూ చదువుతోపాటు విభిన్న రంగాలలో రాణించాలని రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. తెనాలికి చెందిన భీమరాజు, యామినిల కుమార్తె, బాల నర్తకి, కూచిపూడి నాట్యంలో నంది అవార్డు గ్రహీత శోలంకి తేజశ్రీకి పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మానవత సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. 8 సంవత్సరాల వయస్సులో దేశవ్యాప్తంగా 124 ప్రదర్శనలు ఇవ్వడమేకాకుండా పలు సత్కారాలు పొందటం అభినందనీయం అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. మానవత సేవ సంస్థ అందించిన నాట్యమయూరి బిరుదు, షీల్డును తేజశ్రీకి డీఎస్పీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ కె.పృథ్వీగణేష్, సంస్థ అధ్యక్షుడు కోడె గౌరీశంకర్, సభ్యులు కుదరవల్లి వెంకటేశ్వర రావు, పడమటి శ్రీనివాస రావు, కే.శివశంకరరాజు, పిన్ని సాంబశివరావు, మల్లెల రామచంద్రరావు, వై.బుచ్చిరావు, సోలంకి భీమరాజు, బండ్రెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల సమీక్ష సమావేశం సోమవారం మహామండపం నాలుగో అంతస్తులో జరగనుంది. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఉత్సవ ఏర్పాట్లపై చర్చించనున్నారు. ప్రత్యేక ఆహ్వాన పత్రికను మంత్రులు ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యులకు అందజేసే అవకాశం ఉంది. ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.


