ఐద్వా రాష్ట్ర నాయకులు
తాడేపల్లి రూరల్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వేలాది మంది జూనియర్ డాక్టర్లు తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తూ రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు కోరుతున్న విధంగా 30 శాతం స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జూనియర్ డాక్టర్లతో చర్యలు జరపాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ విభాగంలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన తోటి కార్మికుడి కుమార్తైపె లైంగికదాడి చేయడంతో అతనిపై తాడేపల్లి పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం పారిశుద్ధ్య విభాగంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పవన్‌ను ఇటీవల నులకపేట డోలాస్‌నగర్ క్లస్టర్‌కి మార్చారు. తనతోపాటు ఆటోలో చెత్తను సేకరించే తోటి కార్మికుడితో అతని ఇంటికి వెళ్లి 13 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడి చేసి ఆ బాలికను వేరే రాష్ట్రానికి తీసుకువెళ్లాడు. జరిగిన ఘటనలో అన్ని ఆధారాలు సేకరించి పవన్‌పై పోక్సో యాక్ట్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా పవన్‌ను రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.
తెనాలిరూరల్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడడం ప్రారంభించారు. పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు ఎక్కి విద్యుత్ తీగలను కట్ చేసి అపహరించుకెళ్లి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలు.. మండలంలోని బుర్రిపాలెం, ఖాజీపేట, పెదరావూరు పొలాల్లోని విద్యుత్ స్తంభాలు ఎక్కి తీగలను కట్ చేసి తీసుకెళ్లిపోయారని విత్యుత్ శాఖ ఏఈ సుధీర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వీటిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. కేసు దర్యాప్తు చేసిన ఎస్‌ఐ ఆనంద్, నిందితులను భట్టిప్రోలు, మంగళగిరి, గుంటూరుకు చెందిన వారుగా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వీరు ముఠాగా ఏర్పడ్డారు. విద్యుత్‌స్తంభాలను ఎక్కడానికి వినియోగించే బూట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. రాత్రి వేళల్లో పొలాల్లోని విద్యుత స్తంభాలు ఎక్కి తీగలను కట్ చేసి అపహరించుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో చేసిన విద్యుత్ తీగల దొంగతనాల్లో సంతమాగలూరు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం వారు దర్శి సబ్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. తెనాలి మండలంలో చోరీలను అంగీకరించడంతో పీటీ వారెంట్‌పై తెనాలి తీసుకువచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించడంతో తిరిగి దర్శి జైలుకు శనివారం తరలించారు.
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం పలువురు సీనియర్ వైద్యులు గుంటూరు జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ప్రభుత్వం 2016 నుంచి ఇవ్వాల్సిన వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు డైనమిక్ కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద ఆర్థ్ధిక ప్రయోజనంతో ప్రమోషన్లు కల్పించాలని కోరారు. పదోన్నతులు సీనియార్టీకి అనుగుణంగా ఇవ్వాలని, ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేని ప్రభుత్వ వైద్యులందరికి అలవెన్సు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ టి.స్వరూప్‌కాంత్, గుంటూరుకు చెందిన నేతలు డాక్టర్ బి.దేవకుమార్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ అజయ్, డాక్టర్ ఎలిజిబెత్, డాక్టర్ వాసవి, తదితరులు పాల్గొన్నారు.


