ప్రత్తిపాడు: ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగులుగా కాకుండా నూతన ఆవిష్కరణలతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జేఎన్‌టీయూకే వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ ఆకాంక్షించారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కేకేఆర్ అండ్ కేఎస్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్(కిట్స్) కళాశాలలో శనివారం మూడవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జేఎన్‌టీయూకే వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, ఇన్ఫోసిస్ ఏపీ డెలివరీ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ నర్రా సురేష్ హాజరయ్యారు. కళాశాల చైర్మన్ సుబ్బారావు, కార్యదర్శి కోయి శేఖర్‌లతో కలిసి వైస్ చాన్సలర్ ప్రసాద్ పట్టభద్రులకు ఇంజినీరింగ్ పట్టాలు, పురస్కారాలను ప్రదానం చేశారు. వీసీ ప్రసాద్ మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను యువత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇన్ఫోసిస్ ఏపీ డెలివరీ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ నర్రా సురేష్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, నిరంతర అభ్యాసనతోనే కార్పొరేట్ రంగంలో రాణించడం సాధ్యపడుతుందని తెలిపారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కెరియర్‌లో ఒక మరుపురాని ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి కోయి శేఖర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.బాబు, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.హరిబాబు పాల్గొన్నారు.


