కోర్టును పక్కదోవ పట్టించిన వ్యక్తికి భారీ జరిమానా | - | Sakshi
Sakshi News home page

కోర్టును పక్కదోవ పట్టించిన వ్యక్తికి భారీ జరిమానా

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

తెనాలిరూరల్‌: ఓ రుణ వసూలు కేసులో న్యాయస్థానాన్ని బలవంతపు వసూలు సాధనంగా వాడుకోడానికి ప్రయత్నించిన మహిళకు న్యాయమూర్తి తగిన బుద్ధి చెప్పారు. రూ.2.50 లక్షల భారీ జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వివరాలు.. తెనాలికి చెందిన మహిళ సీహెచ్‌ మాధవి, మరో మహిళ వి.కరుణ దగ్గర కొంత మొత్తం నగదు రుణం కింద తీసుకుంది. తనకు అప్పు తిరిగి ఇవ్వడం లేదని, తనకు నగదు ఇప్పించాలని కోరుతూ కరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అంతకు ముందు జరిగిన రిజిస్టర్డ్‌ విక్రయ లావాదేవీలను ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ, మాధవికి సంబంధించిన ఆస్తి ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ను కోర్టులో కరుణ సమర్పించింది. ఈ ఈసీతో మాధవి ఆస్తి వేలానికి కోర్టు అనుమతి తీసుకుని వేలంలో సదరు ఆస్తిని దక్కించుకుంది. ఆస్తి స్వాధీనం చేసుకునే క్రమంలో అసలు యజమాని కోర్టును ఆశ్రయించడంతో కరుణ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కరుణ కోర్టుకు ఈసీ సమర్చించే నాటికి ముందే సదరు ఆస్తిని ఎస్‌.ఆదిలక్ష్మి అనే మహిళకు మాధవి విక్రయించేసింది. ఈ విషయాన్ని దాచిపెట్టి, తనకు అవసరమైనంత వరకే ఈసీని కోర్టుకు సమర్పించి, కరుణ ఆస్తి వేలం అనుమతి పొందింది. వేలంలో ఆస్తిని దక్కించుకున్నానంటూ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఆదిలక్ష్మికి విషయం తెలిపి ఆమె కోర్టును ఆశ్రయించారు. కరుణ ఈసీ సమర్పించి నాటికి ముందూ ఆస్తి విక్రయం పూర్తయిందని కోర్టు గుర్తించి, వేలం సర్టిఫికెట్‌ చెల్లదని పక్కన పెట్టేసింది. ఆదిలక్ష్మి పిటిషన్‌ను పరిశీలించిన ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) ఏకా పవన్‌కుమార్‌, కోర్టు సమయానిన వృథా చేసినందుకు, కోర్టును పక్కదోవ పట్టించినందుకు డిక్రీ హోల్డరైన కరుణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 రోజుల్లోగా మండల న్యాయసేవాధికార సంస్థకు రూ.50 చెల్లించాలని, అలానే తీవ్ర మానసిక క్షోభకు గురైన అసలు యజమాని అయిన ఆదిలక్ష్మికి రూ.రెండు లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడంతో పాటు అసలు యజమానికి మనోవేదన కలిగించడం నేరమని, ఇటువవంటివి పురావృతం కాకుండ ఉండేందుకే భారీ జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్టు న్యాయమూర్తి పవన్‌కుమార్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement