గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి తమ నిరసన తెలిపారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కాంట్రాక్టు ఉద్యోగులందరికీ నూరు శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని కోరారు. ఈనెల 27 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అనంతరం తమ నిరసనలను ఉధృతం చేసి, విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. సెప్టెంబరు 8 వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసి ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మె చేస్తామని యూనియన్ నేతలు వెల్లడించారు. కార్యక్రమంలో కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, బ్లడ్‌బ్యాంకు టెక్నీషియన్లు, కౌన్సిలర్లు, ఫార్మాసిస్టులు పాల్గొన్నారు.


