విశ్రాంత డీజీపీ ఎం.మాలకొండయ్య సంఘం కార్యాలయానికి భవనం కేటాయించాలి
నగరంపాలెం: మంగళగిరి ఆరో బెటాలియన్‌లో ఏపీ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం కార్యాలయానికి భవనం కేటాయించాలని డీజీపీని కోరనున్నట్లు సంఘం అధ్యక్షుడు, విశ్రాంత డీజీపీ ఎం.మాలకొండయ్య తెలిపారు. శనివారం గుంటూరు లక్ష్మీపురం ప్రధాన రహదారిలోని ఏపీ కాటన్ అసోసియేషన్ సమావేశ మందిరం హాల్‌లో ఏపీ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం బలోపేతం, రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమం, పెండింగ్ రీయింబర్స్‌మెంట్, రాష్ట్ర సంఘ కార్యాలయానికి స్థలం కేటాయింపు అంశాలపై చర్చించారు. అధ్యక్షత వహించిన సంఘం అధ్యక్షుడు, విశ్రాంత డీజీపీ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ జిల్లాల్లో సంఘం చేపట్టే కార్యకలాపాల నిర్వహణకు అనువైన పోలీస్ భవనాలు కేటాయించాలని కోరనున్నట్లు చెప్పారు. రిటైర్డ్ పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించేలా అన్ని యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిటైర్డ్ పోలీస్ అధికారుల వివరాలతో ప్రత్యేక రిజిస్ట్రార్ నిర్వహించాలని అన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు సీపీలు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, ఏలూరు, తిరుపతి, విజయవాడ యూనిట్లు సంఘం అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ రిటైర్డ్ పోలీస్ అధికారుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని తెలిపారు. నివేదికను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీని సన్మానించారు. సమావేశంలో సంఘం సీనియర్ కార్యవర్గ సభ్యులు పీవీఎస్ రామకృష్ణ, ఎ.రవిచంద్ర, కె.లక్ష్మణ్‌మోహన్, కె.సత్యనారాయణ, కేవీ.నారాయణ, ఎంఎస్.ప్రసాద్, ఏఎస్‌ఎన్.రెడ్డి, జి.నారాయణస్వామి, ఎల్.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఏకగ్రీవం
ఏపీ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా విశ్రాంత డీఎస్పీ వి.పోతురాజు, ఉపాధ్యక్షులుగా విశ్రాంత డీఎస్పీ పీవీ సుబ్బారెడ్డి, కార్యదర్శిగా విశ్రాంత ఎిస్పీ మేక రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా విశ్రాంత డీఎస్పీ బీరాం నాగేశ్వరరావు, కోశాధికారిగా విశ్రాంత ఏఎస్పీ ఎండీ.మహబూబ్‌బాషా, కార్యవర్గ సభ్యులుగా విశ్రాంత డీఎస్పీ ఎం.జయప్రసాద్, విశ్రాంత ఏఎస్పీ నెట్టం ప్రసాద్ ఎన్నికయ్యారు. జిల్లా యూనిట్ కార్యవర్గాన్ని రాష్ట్ర సంఘం అధ్యక్షులు, విశ్రాంత డీజీపీ ఎం.మాలకొండయ్య అభినందించారు. జిల్లా యూనిట్ నూతన అధ్యక్షులు వి.పోతురాజు మాట్లాడుతూ కార్యవర్గ, సంఘ సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింతగా బలోపేతం చేస్తానని అన్నారు.


