గుంటూరు లీగల్: కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని.. కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు. దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని స్టేక్ హోల్డర్స్ (బ్యాంకు, ఫైనాన్సియల్ సంస్థలు, బీమా కంపెనీల అడ్వకేట్లు)కు మంగళవారం జిల్లా కోర్టులో అవగాహన సదస్సు నిర్వహించారు. మధ్యవర్తిత్వం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్, బ్యాంకు, ఫైనాన్సియల్ సంస్థలు, బీమా కంపెనీ అడ్వకేట్లు, పిటిషనర్ అడ్వకేట్లు పాల్గొన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ
నరసరావుపేట: పీఎంఏవై.20 కింద గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో అధికారులతో కలిసి నిర్మాణంలో ఉన్న గృహాలను మంగళవారం పరిశీలించారు. స్థానిక 33వ వార్డులో లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మాణం పూర్తి చేసి అధికారులతో బిల్లులు పెట్టించుకోవాలని సూచించారు. అనంతరం వినుకొండ పట్టణంలోని 10వ వార్డులో గృహాలను తనిఖీ చేశారు. జాప్యం లేకుండా బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ ఎస్ఈ ఎం.కృష్ణయ్య, జిల్లా అధికారి యూవీఎన్వీ ప్రసాద్, నరసరావుపేట కార్యనిర్వాహక శాఖ అధికారి బి.శివలింగం, ఉపకార్యనిర్వాహక ఇంజినీరు కె.సాంబయ్య, అసిస్టెంట్ ఇంజినీర్లు, వార్డు ఎమినిటీలు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు: గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి మంగళవారం సాయంత్రం ప్రత్తిపాడు పోలీస్ స్టేషనును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, వాటి పురోగతి వివరాలను ఎస్ఐ కె.నరహరిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలతోపాటు రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించారు. సిబ్బంది, మహిళా పోలీస్‌లతో మాట్లాడి మెరుగైన పోలీసింగ్‌పై దిశానిర్దేశం చేశారు. తదనంతరం ప్రత్తిపాడు సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఐజీ మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషనులో పబ్లిక్కు ఫ్రెండ్లీ ఓరియెంటెడ్ ఉందా, ప్రజలకు న్యాయం జరుగుతుందా, పోలీస్ అధికారులు ఎలా పనిచేస్తున్నారనే అంశాలను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఐజీ వెంట గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, ప్రత్తిపాడు సీఐ పి.సుబ్బారావు తదితర అధికారులు ఉన్నారు.
వినుకొండ: అప్పుల బాధ, పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగులపాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరిబోయిన వెంకటేశ్వర్లు తండ్రి, తల్లి, తమ్ముడు అప్పులు చేసి ఊరు విడిచి వెళ్లిపోయారు. గ్రామంలో ఉన్న వెంకటేశ్వర్లును పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తుండడంతో, మనస్తాపానికి గురై ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతకుముందు తన బాధను సెల్ఫీ వీడియోలో తెలిపాడు. బంధువులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించారు.


