నడింపాలెంలో కేంద్ర బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

నడింపాలెంలో కేంద్ర బృందం పర్యటన

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. స్థానిక 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి ఉన్న 149/4 సర్వే నంబరులో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయుష్‌ ఆస్పత్రితోపాటు అనుబంధ సంస్థలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యోగా అండ్‌ నేచురోపతి (సీసీఆర్‌వైఎన్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ జ్యోతి కేశ్వాని, ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సీనియర్‌ ప్రాజెక్టు మేనేజర్‌–కన్సల్టెంట్‌ ప్రమోద్‌ వర్మ, పరిశోధన అధికారి డాక్టర్‌ ఎన్‌.వి. జ్ఞానదీప్‌ తటావర్తిల బృందం ప్రతిపాదిత స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ సీఎం. సాయికాంత్‌ వర్మతో కలిసి పరిశీలించింది. స్థల స్వభావం, విస్తీర్ణం, హద్దులు, రోడ్డు మార్గం తదితర అంశాలను బృంద సభ్యులకు కలెక్టర్‌ వివరించారు. ప్రతిపాదిత స్థలం పక్కనే వాగు ఉండటంతో వరదల సమయంలో వరద నీరు ఆస్పత్రిలోకి వచ్చే అవకాశం ఉందని, అలానే నిర్దేశిత భూమిలో ఒక రైతుకి చెందిన పట్టా భూమి ఉందని బృంద సభ్యులు ప్రస్తావించారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ ఈ స్థలంలో ఆస్పత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపితే వారం రోజుల్లో సమస్య పరిష్కరించి భూమి అప్పగిస్తామని చెప్పారు. వరద సమస్య లేకుండా కాంక్రీట్‌ డ్రైన్‌ నిర్మాణం చేపట్టి అందజేస్తామని కలెక్టర్‌ వివరించారు. సాధ్యమైనంత త్వరగా స్థలాన్ని ఫైనల్‌ చేసి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ, ఆయుష్‌ విభాగం డైరెక్టర్‌ రోనంకి గోపాలకృష్ణ కేంద్ర బృందాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement