వ్యాపారి లారీలను స్టేషన్‌లో అప్పగించిన ముస్తఫా కుమారుడు పోలీసుల సమక్షంలో అప్పగించినా కిడ్నాప్ కేసు పెట్టడం దారుణం నూరి ఫాతిమాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆమె తండ్రిపై తప్పుడు కేసు మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి
గుంటూరు ఎడ్యుకేషన్ : వైఎస్సార్ సీపీకి చెందిన గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన తనయుడు బషీర్‌పై నూజివీడు పోలీసుస్టేషన్‌లో అక్రమంగా కేసు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. బుధవారం సిద్ధార్థనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ దశాబ్దాలుగా పొగాకు వ్యాపారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు కొయ్యలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి సూర్యచంద్రరావుతో లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగా రూ.36 లక్షల విలువైన పొగాకు కొనుగోలుకు డబ్బు చెల్లించిన ముస్తఫాకు సూర్యచంద్రరావు సరుకు పంపలేదని చెప్పారు. కొయ్యలగూడెం వెళ్లిన ముస్తఫా తనయుడు బషీర్‌కి లారీల్లో వేరొకరికి సరకు పంపుతున్నారని తెలిసిందన్నారు. ఆ లారీలను తీసుకువచ్చి పెదకాకాని పోలీసుస్టేషన్‌లో అప్పగించారని, వ్యాపారి కుమారుడిని కూడా తీసుకొచ్చి అప్పగించారని చెప్పారు. వ్యాపారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు.
బాధితులపైనే తప్పుడు కేసులు
ఎమ్మెల్యే ముస్తఫా, బషీర్‌లు సూర్యచంద్రరావు కుమారుడిని కిడ్నాప్ చేశారని నూజివీడులో తప్పుడు కేసు పెట్టారని అంబటి చెప్పారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ ఇవ్వలేదన్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశానికి రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యం అంటూ, ఆయన కుమారుడు కిడ్నాప్‌కు పాల్పడ్డారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉన్న ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ఈ రాజకీయ దాడిని ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ పరంగా ముస్తఫాకు అండగా ఉంటామన్నారు.
స్థాయిని దిగజార్చుకున్న చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యవహారంలో చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారని అంబటి పేర్కొన్నారు. సిద్ధాంతాలు లేని చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలవచ్చని, తన పార్టీ నేతలు ప్రతిపక్షంలో ఉన్న ఆ సామాజికవర్గం వారితో మాట్లాడడం మాత్రం నచ్చటం లేదన్నారు.


