ఇవేమి జ్వరాలు బాబోయ్‌! | - | Sakshi
Sakshi News home page

ఇవేమి జ్వరాలు బాబోయ్‌!

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం

జ్వరాలతో అల్లాడుతున్న

గుంటూరు నగరం

చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ

విజృంభిస్తున్న వైనం

ప్రభుత్వ ఆసుపత్రిలో

అందుబాటులో ఉండని వైద్యులు

కిటకిటలాడుతున్న గుంటూరు జీజీహెచ్‌

గుంటూరు మెడికల్‌: ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌ జ్వర బాధితులతో కిక్కిరిసిపోతోంది. గుంటూరు నగరంతో పాటు రూరల్‌ ఇతర గ్రామీణ ప్రాంతాల వారు కూడా పలు రకాల జ్వరాలతో ఆస్పత్రిబాట పడుతున్నారు. అయినా ఆరోగ్య శాఖ చోద్యం చూస్తూ జ్వర నివారణ చర్యలపై శీతకన్ను వేసింది. పేదలకు ఈ వైద్యశాలే దిక్కు కాగా.. ఆర్థికంగా ఫర్వాలేదు అనుకున్న వారు మాత్రం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాలో 1717 ఫీవర్‌ కేసులు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారిక లెక్కల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు 1717 ఫీవర్‌ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 27 డెంగీ కేసులు కాగా, 1200 టైఫాయిడ్‌ కేసులు, ఐదు మలేరియా కేసులు, మిగితావి సాధారణ జ్వరాలుగా నమోదయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం శోచనీయం. దీంతో జీజీహెచ్‌తో పాటు నగరంలోని ప్రైవేటు వైద్యశాలల్లో జ్వరపీడితులు సాంత్వన పొందుతున్నారు.

మలేరియా నిధులు ఎటు పోతున్నట్లో..?

దోమల నియంత్రణ కోసం జిల్లా మలేరియా విభాగానికి ప్రత్యేక నిధులు వస్తుంటాయి. అయితే వాటిని ఎక్కడ, ఎంత ఖర్చు చేస్తున్నారో ఎవరికీ సమాచారం ఉండటం లేదు. ప్రతి ఏడాది జిల్లాలో డెంగీ, మలేరియా వంటి జ్వరాలు దోమల వల్లే అధికంగా వ్యాపిస్తున్నాయి. మలేరియా విభాగంలో ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ జ్వర కేసుల వివరాల సేకరణ, జ్వరాల నియంత్రణ వంటి కార్యక్రమాలు చేస్తున్న దాఖలాలు పెద్దగా ఉండవు. జిల్లా మలేరియా అధికారి ఎప్పుడు కార్యాలయంలో అందుబాటులో ఉండరన్న ఆరోపణలున్నాయి. ప్రతిరోజూ కార్యాలయంలో ఉండకుండా సొంత పనులు చక్కదిద్దుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు అధికారే ఇలా ఉంటే సిబ్బంది ఎందుకు సక్రమంగా విధులు నిర్వహిస్తారని అంతా ప్రశ్నిస్తున్నారు.

వివరాల సేకరణలో విఫలం

పెద్ద ఎత్తున జ్వరాల కేసులు నమోదు అవుతున్నా వివరాలు సేకరించడంలో వైద్యారోగ్య శాఖ పూర్తిగా విఫలం అయింది. సిబ్బంది వెళ్లి తనిఖీ చేయాల్సిన నిబంధనలకు పాతర వేశారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు కూడా జ్వరాలతో చికిత్స పొందుతున్న వారి వివరాలు, డీఎంహెచ్‌ఓ కార్యాలయం అధికారులకు తెలియజేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంగీ మాసోత్సవాలు, మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి శుక్రవారం ఏఎన్‌ఎం, ఇతర వైద్య సిబ్బందికి గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సీజనల్‌ వ్యాధులు, ముఖ్యంగా జ్వరాలను ఏవిధంగా గుర్తించి, చికిత్స అందించాలనే విషయాలపై తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి,

డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement