తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం కేఎల్ యూనివర్శిటీలో ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ జాతీయ సమైక్యతా శిబిరం సోమవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్శిటీ ఎన్‌సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ వి.మౌనిక మాట్లాడుతూ ఈ శిబిరంలో ఉత్తరప్రదేశ్‌నుంచి మొత్తం 150 మంది, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఎన్‌సీసీ గ్రూపుల నుంచి 450 మంది క్యాడెట్లు పాల్గొన్నారని తెలిపారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ అనే ఆశయాన్ని స్వీకరిస్తూ, క్యాడెట్లు ఒకరితో ఒకరు మమేకమవ్వడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, ఒకరి సంప్రదాయాలను మరొకరు అర్ధం చేసుకోవడానికి ఈ శిబిరం అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు. క్యాడెట్లు సూర్యలంక వైమానిక దళ కేంద్రం, మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, సూర్యలంక బీచ్, టీటీడీ ఆలయం, ఉండవల్లి గుహలను సందర్శించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల క్యాడెట్లు జానపద నృత్యాలు, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా తమ సంప్రదాయాలను ప్రదర్శించారని వివరించారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ శుభంషు దుబే నాయకత్వంలో ఈ శిబిరం నిర్వహించామన్నారు. డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ కల్నల్ ఉదయ్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ పర్యవేక్షణలో శిబిర కార్యకలాపాలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ వీసీ డాక్టర్ జి.పార్ధసారధి వర్మ, ప్రో వైస్ చాన్స్‌లర్లు డాక్టర్ ఎన్.వెంకట్‌రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌చార్జి డీన్ డాక్టర్ కేఆర్‌ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.


