11 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం | - | Sakshi
Sakshi News home page

11 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం

Jul 6 2026 1:28 AM | Updated on Jul 6 2026 1:28 AM

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 11 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 12.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా పొన్నూరు మండలంలో 0.2 మి.మీ. వర్షం పడింది. సగటున 2 మి.మీ వర్షపాతం నమోదైంది. వివరాలు.. తాడికొండ మండలంలో 5.4 మి.మీ., తుళ్లూరు 4.4, మంగళగిరి 3.8, తాడేపల్లి 3.6, దుగ్గిరాల 2.6, గుంటూరు పశ్చిమ 1.8, కాకుమాను 1.2, గుంటూరు తూర్పు 1, పెదనందిపాడు మండలంలో 0.6 మి.మీ చొప్పున వర్షం పడింది. జూలై మాసంలో 5వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 26.6 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 6.8 మి.మీ. వర్షపాతం మాత్రమే పడింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొల్లూరు: టాటా ఏస్‌ ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన కోలా నారాయణ(50) తన సైకిల్‌పై ఉదయం 5.30 సమయంలో పోలీసు స్టేషన్‌ వైపు వస్తున్నాడు. అదే సమయంలో తెనాలి సోమసుందరపాలేనికి చెందిన ఆటో డ్రైవర్‌ కొబ్బరికాయల లోడ్‌కు భట్టిప్రోలు మండలం చింతమోటు వెళుతూ ఎదురుగా వస్తున్న నారాయణను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రగాయాల బారిన పడిన నారాయణను స్థానికులు 108లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆటోను పోలీసు స్టేషన్‌కు తరలించగా, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఇంజినీరింగ్‌ విద్యార్థి..

కంచికచర్ల: సెలవురోజు కావడంతో సెల్‌ఫోన్‌ బాగు చేయించుకుందామని స్నేహితుడితో బైక్‌పై వెళ్లి తిరిగి కళాశాలకు వస్తుండగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ పి.విశ్వనాథ్‌ కథనం మేరకు.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన బాలవోలు గణేష్‌(21), నందిగామకు చెందిన ప్రవీణ్‌ ఇబ్రహీంపట్నం మండలంలోని వేర్వేరు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ చదువుతున్నారు. వారిద్దరు స్నేహితులు. గణేష్‌ తన సెల్‌ఫోన్‌ బాగు చేయించుకునేందుకు ప్రవీణ్‌తోకలిసి మరో స్నేహితుడి బైక్‌పై నందిగామ వచ్చారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం కళాశాలలకు తిరిగి వెళ్తుండగా కంచికచర్ల మండలం కీసర సమీపంలోని జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి డివైడ్‌ను ఢీకొని రెండు రోడ్ల మధ్యలో ఉన్న సాగర్‌కెనాల్‌లో పడిపోయింది. ఆ సమీపంలో పెద్ద బండరాళ్లు ఉండటంతో గణేష్‌, ప్రవీణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న నేషనల్‌ హైవే అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి గణేష్‌ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎల్‌ఐసీ వాటాల విక్రయం

ఉపసంహరించుకోవాలి

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు

మచిలీపట్నంటౌన్‌: జీవిత బీమా సంస్థలో రూ.10 వేల కోట్ల వాటాల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు సీఐటీయూ తరఫున పోరాడతామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌. నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కోనేరు సెంటర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎల్‌ఐసీని కాపాడాలని కోరుతూ ధర్నా చేశారు. నర్సింగరావు మాట్లాడుతూ.. ఔషధ రంగానికి సంబంధించి ఐడీపీఎల్‌ కంపెనీని కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్‌ పరం చేయడంతో సామాన్యులకు ఔషధాల ధరలు అందనంత విధంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మోదీ నిరంకుశ విధానాలకు తోడు రాష్ట్రంలో చంద్రబాబు కూడా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడంలో ముందు వరుసలో ఉంటున్నారని దుయ్యబట్టారు. సీఐటీయూ పోరాటం చేయకుంటే 2021లోనే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం అయిపోయేదని పేర్కొన్నారు. 1956లో రూ.5 కోట్ల మూల నిధితో ప్రారంభమైన ఎల్‌ఐసీ నేడు లక్షల కోట్ల సొంత ఆస్తులు కలిగే పరిస్థితికి ఎదిగిన కామధేనువు లాంటి సంస్థను వాటాల విక్రయం పేరుతో ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పోరాటాల ద్వారా తిప్పికొట్టాలన్నారు. ఐసీయూ మచిలీపట్నం డివిజన్‌ అధ్యక్షుడు దేవనబోయిన వాసు, ఎల్‌ఐసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు బి.హెచ్‌.వి.ఎల్‌.రాధాకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement