వెన్నుపోటు పాలనకు రెండేళ్లు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పాలనకు రెండేళ్లు

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

వెన్నుపోటు పాలనకు రెండేళ్లు చంద్రబాబు సర్కారు వచ్చాక సంక్షేమం శూన్యం

అమలుకాని హామీలు

రైతులకు కన్నీరే మిగిల్చారు

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుకే ప్రాధాన్యం

ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పేరుతో వల

అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం

రాజధాని పేరుతో హడావిడిపై రైతుల ఆగ్రహం

చంద్రబాబు సర్కారు వచ్చాక సంక్షేమం శూన్యం
చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్‌ సిక్స్‌ అంటూ అలవికాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయకపోగా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్నికల సమయంలోఊదరగొట్టి తర్వాత హామీలు అమలు చేయకపోవడం ఆయన నైజమని మరోసారి తేలింది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెనాలి, పొన్నూరు, గుంటూరు, తాడికొండ, ప్రత్తిపాడు సభలతోపాటు బీసీ ఘర్జనలో పాల్గొన్ని సూపర్‌ సిక్స్‌ గురించి ఊదరగొట్టారు. తాము వస్తే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. గుంటూరులో ఏకంగా ఐటీ టవర్లు కట్టి ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సూపర్‌సిక్స్‌ పథకాల గురించి తమ అనుకూల పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.

మంత్రి అనుమతితోనే కేసులు

గుంటూరు జిల్లాలో పూర్తిగా మంత్రి లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగమే నడుస్తోంది. పోలీసులు ఏ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నా లోకేష్‌ అండ్‌ టీం అనుమతి ఉండాల్సిందే. లేకపోతే కేసు కూడా నమోదు కాని పరిస్థితి గుంటూరు జిల్లాలో నడుస్తోంది. ముఖ్యంగా సోషల్‌మీడియా ఫిర్యాదులైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా అది బుట్టదాఖలే అవుతోంది. సోషల్‌ మీడియా కేసులు, వైఎస్సార్‌సీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలో వారి వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. కోర్టులు అక్షింతలు వేస్తున్నా పోలీసుల వైఖరి మారలేదు. చినబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇక దాడులు కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏడున్నర గంటలసేపు చేసిన దౌర్జన్యం, హింసాకాండ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లాలో కూటమిలోని ఇతర పార్టీ నేతలతోపాటు ముఖ్యంగా కాపు సామాజికవర్గం వారిపై జరుగుతున్న దాడులతో వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

పేరుకే పథకాలు

తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ. 15 వేలు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క మహిళకు కూడా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల తాలూకు డబ్బులు జమ కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి అందజేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పారు. అన్నదాతకు అండగా ఏడాదికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత మాట మార్చారు. అసలు సూపర్‌ సిక్స్‌ హామీలను చూస్తుంటేనే భయం వేస్తుందంటున్నారు. సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్నా ఇప్పటికీ సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఉన్న చోట కూడా అరకొర మాత్రమే ఉన్నాయి. కొత్త బస్సులు లేవు. దీనివల్ల మహిళా ప్రయాణికులకు పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది.

యువతకు అన్యాయం

‘యువతకు ఉపాధి కల్పిస్తాం. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తాం. లేదంటే రూ. 3 వేలు భృతి ఇస్తామంటూ’ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే భృతి కూడా లేకుండా పోయింది. ప్రస్తుత పాలన సంక్షేమం నుంచి సంక్షోభం వైపునకు వెళ్తోంది. ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందేలా చూశారు. తర్వాత మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను మాత్రమే పెంచిన కూటమి ప్రభుత్వం... మిగిలిన పథకాలకు తిలోదకాలు ఇచ్చింది.

గుంటూరులో భూగర్భ డ్రైనేజీని పూర్తి చేస్తామని కూటమి నాయకులు చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై అడుగు ముందుకు పడలేదు. ‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్‌ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామంటూ’ గుంటూరు పర్యటనలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులు, అంజుమన్‌ ఆస్తులను ఏపీఐఐసీకి ధారాదత్తం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్‌ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి చేయకపోగా అవినీతికి గేట్లెత్తేశారు. నగరం నడిబొడ్డున ఉన్న శంకర్‌ విలాస్‌ బ్రిడ్జిని కూడా తక్కువ నిధులు వచ్చాయని ఫ్లైఓవర్‌ బదులుగా మళ్లీ బ్రిడ్జినే కడుతూ వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు.

అన్నదాతలను రోడ్డున పడేశారు. ఈ రెండేళ్లలో తుపాన్లు, వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. గుంటూరు చానల్‌, కొండవీటి వాగుల వల్ల పూర్తిగా మునిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, కంది, పత్తి రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. రాజధాని అమరావతిలో అవినీతి రాజ్యమేలుతోంది. భూములు ఇవ్వని రైతులను వేధిస్తుండటంతో వారందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. మరోవైపు రెండోవిడత భూసమీకరణను రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement