పిల్లి కూతలు కూస్తే ..
గుంటూరు ఎడ్యుకేషన్ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్‌కుమార్ హెచ్చరించారు. గురువారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మాణిక్యరావుకు తగదని, వైఎస్ జగన్‌కు విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. టీడీపీలోని అగ్రవర్ణ నేతలు మాణిక్యరావును ముందు ఉంచి, విమర్శలు చేస్తున్నారని, టీడీపీలో మాణిక్యరావు బలిపశువేనని అన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై చవకబారు మాటలు, ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటన్నారు. ఎంఆర్‌పీఎస్‌లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన మాణిక్యరావు ఉద్యమాన్ని వదిలేసి, డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, పిల్లి కూతలు కూస్తే, నాలుక కోస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్‌ను తిడితేనే టీడీపీలో పదవి అని, చంద్రబాబు, లోకేష్ దిగువస్థాయి నాయకులతో పదే, పదే నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, పదవుల కోసం దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్న మాణిక్యరావు టీడీపీకి అధికారం మరో మూడేళ్లే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ డీఎస్సీలో తమకు నష్టం జరిగిందని 200 మందు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారనీ, మెరిట్‌జాబితాలను కలెక్టరేట్లలో ఎందుకు ప్రచురించలేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందనే విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడకపోవడంతోనే అర్ధమవుతోందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి.అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు.


