గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. సన్నాహాక కార్యక్రమంలో భాగంగా గురువారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు, పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. ఆమె.. మాట్లాడుతూ ఈ నెల 28 బూత్ స్థాయిలో, 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని వెల్లడించారు. సుమారు 1,49,054 మంది 0 నుండి 5 ఏళ్ల పిల్లలు ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం 12,899 పోలియో వ్యాక్సిన్ వైల్స్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో 584 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు , డబ్ల్యుహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ జి.భవాని, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సురేష్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్, డాక్టర్ ప్రియాంక, డెమో శివ సాంబిరెడ్డి, డీపీవో సైమన్, సూపర్‌వైజర్ శాస్త్రి పాల్గొన్నారు.


