మెగా కాదు దగా డీఎసీ | - | Sakshi
Sakshi News home page

మెగా కాదు దగా డీఎసీ

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

డీఎస్సీలో ప్రతిభావంతులకు

మొండిచేయి

పరీక్షలపై సీబీఐ విచారణ జరిపించాలి

చంద్రబాబు, లోకేష్‌లు సమాధానం చెప్పాలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సురేంద్ర

పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేత

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

గుంటూరు వెస్ట్‌: ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం చేసే విధంగా మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియ ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు జి.సురేంద్ర డిమాండ్‌ చేసారు. బాధితులతో కలిసి సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో దళిత కుటుంబాలకు చెందిన కర్రా బేబి, మేడిద సుధారాణిలకు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు, రాష్ట్ర స్థాయిలో 140,143 ర్యాంకులు వచ్చాయన్నారు. వీరికి ఉద్యోగం ఇవ్వకుండా క్రీడా కోటా కింద ఇతరులకు ఉద్యోగాలివ్వడమేంటో అర్ధం కావడంలేదన్నారు. ఇద్దరు దళిత యువతులకు ఇక్కడే అన్యా యం జరిగిందన్నారు. ఇక రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంత అన్యాయం చేసారో గమనించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా కోటాలో 400 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారన్నారు. ఆ వివరాలు అడిగితే సమాధానం చెప్పడంలేదన్నారు.

ప్రశ్నిస్తే దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు

డీఎస్సీ ఎంపిక ప్రక్రియ విషయంలో ప్రశ్నించే వారిని దుర్మార్గులుగా చిత్రీకరించే యత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రశ్నా పత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్‌ కోటా ఎంపిక తదితర అంశాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అనేక మంది అభ్యర్ధులు డీఎస్సీలో ఎంపికవుదామని అహర్నిశలు కష్టపడి చదువుకుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రతి అంశంలో ముందుకు వచ్చే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మాట్లాడడంలేదో చెప్పాలని డిమాండ్‌ చేసారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేదిలేదన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న బాధితుల తరపున వైఎస్సార్‌ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని సురేంద్ర హెచ్చరించారు.

అది దగా డీఎస్సీ..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్‌ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పెద్ద దగా డీఎస్సీగా వర్ణించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్‌ పూర్తి వైఫల్యం చెందారన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ప్రతిభకు ప్రభుత్వం నిలు వునా పాతరేసిందన్నారు. ఎందరో ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు వీరికి ఎవరి చ్చారని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగుల తరపున రాజీలేని పోరాటానికి సిద్ధపడ్డారని ఆయనకు అండగా రాష్ట్ర యువత నిలుస్తుందని చెప్పారు. పార్టీ ఎస్సీ విభాగం పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు జి.ప్రభు, అంకాల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ బత్తుల దేవానంద్‌, పార్టీ ఎస్సీ విభాగం నేతలు పున్నారావు, సిహెచ్‌ కిరణ్‌, టి.నాని, గేరా సంజీవ్‌, పి.కవిత, ఆర్‌.వరలక్ష్మి, పిల్లి మేరి, బత్తుల వెంకట్‌, జల్ది స్వామినాథన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement