ముగిసిన కొండవీడు కళా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కొండవీడు కళా సంబరాలు

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

ముగిసిన కొండవీడు కళా సంబరాలు నాటక రంగానికి యువత అవసరం

నాటక రంగానికి యువత అవసరం

యడ్లపాడు: కొండవీడు కళాపరిషత్‌ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు కళల పండుగలా కొనసాగాయి. మూడో రోజు ఆదివారం మూడు అద్భుత కళారూపాలు ప్రదర్శితం అయ్యాయి. వేటికవే గొప్ప కథనాలతో కళాకారుల పోటాపోటీ అభినయంతో ప్రేక్షకుల్ని అలరించాయి. నిర్వాహకులు కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, నంబూరు వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు, మల్నేని సీతారామాంజనేయులు, కనపర్తి శ్రీనివాసరావు, కట్టా వీరాంజనేయులు, నంబూరు శివరామకృష్ణ, బ్రహ్మవరప్రసాద్‌ కృషిని దాతలు, కళాభిమానులు అభినందించారు.

అమ్మచెక్కిన బొమ్మ

సృష్టిలోని అనంతమైన వైవిధ్యాన్ని ఆస్వాదించలేక..మూసధోరణిలో బతుకుతున్న నేటి సమాజపు సంకుచిత మనస్తత్వాన్ని నిలదీసే అద్భుత కళారూపం అమ్మచెక్కిన బొమ్మ నాటిక. ఆడ, మగ అనే రెండు పార్శ్వల మధ్య నలిగిపోతూ, తన గుర్తింపు కోసం పరితపించే మూడో ప్రకృతి అస్తిత్వ పోరాటాన్ని ఈ నాటిక కళ్లకు కట్టింది. గోవాడ క్రియేషన్స్‌ వేదికగా వచ్చిన ఈ నాటికకు జ్యోతిరాజ్‌ భీశెట్టి మూలకథను అందించగా, డాక్టర్‌ వెంకట్‌ గోవాడ తన నాటకీకరణతో, దర్శకత్వ ప్రతిభతో దీనికి ప్రాణం పోశారు.

అందరూ మంచివారే కానీ..!

కన్నప్రేమను మించిన కరుణతో సాగాల్సిన అనుబంధాలు, కాసుల కక్కుర్తి ముందు ఎలా కరిగిపోతాయో సాక్షాత్కరించింది అందరూ మంచివారే కానీ..నాటిక. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న మరదలి ప్రాణం కంటే డబ్బే ముఖ్యమని భావించిన ఒక వదిన స్వార్థం, ఆ ఇంటి మమకారాన్ని బలితీసుకోవడం వీక్షకుల మనసును కలచివేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మంచితనం మంటగలిసి, రక్తసంబంధం ఆర్థిక సంకెళ్లకు బందీ కావడాన్ని ఈ ప్రదర్శన అత్యంత సహజంగా ఆవిష్కరించింది. జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో మానవత సాగరి (యడ్లపాడు) బృందం అద్భుతంగా రంగస్థలంపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది.

ఇది అతని సంతకం

సమకాలీన సమాజంలో మనిషి వ్యక్తిత్వానికి, పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది ఇది అతని సంతకం నాటిక. జీవిత చరమాంకంలో ఎవరికీ భారంగా మారకూడదని, తనకంటూ ఒక నిర్దిష్టమైన జీవన శైలిని రూపొందించుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి, అబద్ధం లేని సిద్ధాంతాలతో సమస్యల నెదురిస్తూ సాగించిన ప్రయాణం ఇందులో స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. ఈ నాటికను గుంటూరు అభినయ ఆర్ట్స్‌ ప్రదర్శించగా, శ్రీస్నిగ్థ రచించారు. ఎన్‌.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement