తీరం.. ఫలహారం! | - | Sakshi
Sakshi News home page

తీరం.. ఫలహారం!

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

తీరం.. ఫలహారం!

మత్స్యకారులకు నష్టం

చీరాల అర్బన్‌: తమ భూములపై హక్కును కోల్పోయేలా మత్స్యకారులను ప్రభావితం చేయటం వెనుక పెద్ద కుట్ర దాగుందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ నెల 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు సముద్రంలో వేటపై నిషేధం విధించనున్నారు. మత్స్యసంపద పునరుత్పత్తి జరిగే సమయం కావటం అందుకు కారణం. పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో అతిక్రమణలకు తెర తీశారు. అందులో రిసార్టుల నిర్వాహకులు ముందున్నారు. రిసార్టుల ఎదురు రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంపై వారసత్వ హక్కు ఉన్న మత్స్యకారులను ఆర్థికంగా ప్రలోభపరచుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

వీరికి లాభమేంటంటే..

తీరం నుంచి రోడ్డు వరకు ఉన్న తీర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటంతో సీవ్యూ పేరుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో పాటు రాత్రి వేళల్లో క్యాంప్‌ ఫైర్‌ పేరుతో విందు, వినోదాలు ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా ఫంక్షన్లు కూడా తీరం వెంట నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి భారీగా డబ్బు వసూలు చేసి అడ్డగోలుగా ఆర్జిస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘన

అతిక్రమణలపై అధికారుల నియంత్రణ శూన్యమనే చెప్పాలి. వారిని కూడా నిర్వాహకులు తమదైన శైలిలో తృప్తి పరుస్తుండటం అందుకు కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఒకటి, రెండు రిసార్టులకు మినహా మిగిలిన వారికి అనుమతులు లేవు. అనుమతులు ఉన్న వాటిలో కూడా అతిక్రమణలు ఉన్నాయి. ఇది అన్ని శాఖల అధికారులకు తెలిసిన బహిరంగ రహస్యం.

అధికార ముద్ర పడితే చాలు

‘‘అనుమతులా? అవెందుకు? ఎమ్మెల్యేతో ప్రారంభించుకుంటాం. దాంతో అధికార ముద్ర పడుతుంది. అవసరమైతే వారిని సంతృప్తి పరుస్తాం. దీంతో పాటు పార్టీ ఫండ్‌ ఇచ్చి సహకరిస్తామని చెప్తాం. అది చాలు. అంతేకానీ ఆ అనుమతి, ఈ అనుమతి అంటూ వివిధ శాఖల అధికారులు చుట్టూ ఎక్కడ తిరుగుతాం. తిరిగినా పని కాదు. నిబంధనల మేరకు రిసార్టు కట్టాలంటే అయ్యే పని కాదు. అయినా మమ్మల్ని ఏమన్నా చేయాలంటే మాకన్నా ముందు కట్టిన వారిపై చర్యలు చేపట్టండని అడుగుతాం. మరి ఇప్పుడు కూడా జరుగుతున్న నిర్మాణాల సంగతేంటని అడుగుతాం. ఇదో కందిరీగల తుట్టె. ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తున్నాం. ఇక మాపై చర్యలేంటి?’’ అనే మాటలు రిసార్టుల యజమానుల నుంచి వినిపిస్తున్నాయి.

పరిష్కారం ముఖ్యం

పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే రిసార్టుల నిర్మాణం లేదా నిర్వహణ నిబంధనల మేరకు సాగించటమనేది పెద్ద కష్టమేమీ కాదు. అలా చేస్తే ఒక విధమైన క్రమశిక్షణ వస్తుంది. తీరంలో భద్రత పెరుగుతుంది. అలా చేస్తే సంబంధికుల వ్యక్తిగత ప్రయోజనాలకు గండి పడుతుంది. అందుకే వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సునామీ సమయంలో 8 మంది మృతి

చంద్రబాబు సర్కారు నిర్వాకంతో సముద్ర తీరం పరాధీనమవుతోంది. వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతికి తీరం వెంట కేటాయించిన అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మడచెట్లు మాయం అయ్యాయి. అందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రిసార్టుల నిర్వాహకులు కారణం. చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో విలువైన సహజ సంపద ప్రమాదంలో పడుతోంది.

గతంలో సునామీ విపత్తు వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో 8 మంది మృత్యువాత పడ్డారు. అన్నీ సక్రమంగా ఉంటే అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అతిక్రమణలతో జరిగే ప్రమాదాలు కనిపించవు. ఏదన్నా సునామీ లాంటి విపత్తు ఎదురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే అందుకు ప్రస్తుతం కొమ్ముకాస్తున్న పాలకులు, అధికారులు బాధ్యత వహిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి తీరం వెంట అటవీ భూమి సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల భృతి కోసం కేటాయించింది. తీరం వెంట ఉన్న మడ చెట్లతోపాటు వారికి కేటాయించిన భూముల్లో సరిగ, యూకలిప్టస్‌, సుబాబుల్‌ వంటి సామాజిక వనాలను పెంచాలి. అందులో జీవాలు, పశువులను మేపుతూ భృతి పొందాలి. కోతకు వచ్చిన వనాల కలపను విక్రయించి వచ్చిన డబ్బుతో వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలి. ఇది ఈ ప్రక్రియ లక్ష్యం. తమకు కేటాయించిన ప్రాంతం ఎప్పుడైతే వివిధ కారణాలతో పరాధీనం అయ్యిందో, అప్పటి నుంచి తీరంలో సామాజిక వనాలు, మడచెట్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. మత్స్యకార గ్రామాల్లో పలువురు జీవాలు, గేదెల మేపునకు కూడా సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్‌లో వారు తమ ఉనికినే కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement