రెడ్డిగూడెంలో అధికారికంగా 22 ఎకరాల పొలం కొనుగోలు చేశా అక్కడ దిగుడు బావి మినహా గెస్ట్‌హౌస్, ఈతకొలను లేవు పొలంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సంబంధమేంటి? మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): టీడీపీ ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై పాశవికమైన దాడికి పాల్పడిందని... దీనిపై నెల రోజులకుపైగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు సిద్ధార్థనగర్‌లోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... భౌతికంగా, చట్టపరంగా కూడా దాడులకు దిగుతున్నారని, ప్రస్తుతం నా ఆస్తులపై కూడా దాడుల పరంపర కొనసాగిన్నారని చెప్పారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో 22 ఎకరాల పొలం గతంలో కొనుగోలు చేశానని అన్నారు. దీంతో పొలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశానని, అందులో వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తనపై బనాయించిన అక్రమ కేసుల్లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా, సర్వే పేరుతో రాజుపాలెం మండల ఎమ్మార్వో ఆఫీస్ నుంచి ఒక నోటీసు (లెటర్) ఇచ్చారని అంబటి గుర్తుచేశారు. పొలాన్ని సర్వే చేయాలని పేర్కొనగా, దానికి బదులిచ్చానని చెప్పారు. అయితే ఆ లెటర్‌ను రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి పంపించారని తెలిసిందని అన్నారు. ఆ పొలంలో గెస్ట్‌హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉందని అంటున్నారని, కానీ దిగుడు బావి మాత్రమే ఉందని తెలిపారు. పొలం కొనుగోలు చేసిన సమయంలో ఉన్న రేకుల షెడ్‌కే మరమ్మతులు చేయించానని స్పష్టం చేశారు. తన పొలానికి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సంబంధం ఏంటని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు కృష్ణానది గర్భంలో నివసిస్తుంటే ఏమీ చేయలేదని, తన పొలంలో బావి ఉంటే తప్పు ఏంటని అన్నారు. ఈ నోటీసుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని తెలిపారు. వారికి పనీపాట లేదని విమర్శించారు. అన్నింటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. లీగల్‌గా సంపాదించిన ఆస్తులని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.


