వైఎస్ జగన్ దృష్టికి అంజుమన్ భూముల విషయం తీసుకెళ్లాం
నేటి నుంచి ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): చినకాకానిలోని అంజుమన్ భూముల విషయాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా చెప్పారు. అంజుమన్ భూముల పరిరక్షణకు ఆయన పూర్తిస్థాయిలో అండగా ఉంటానని భరోసానిచ్చారని తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. అంజుమన్ భూములను కాపాడుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, దీనిపై ఇప్పటికే తాను స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగిందన్నారు. ఈ నెల 30న గుంటూరు నగరంలో భారీ నిరసన శాంతి ర్యాలీ జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీలలో నగరంలో సంతకాల సేకరణ చేపడుతున్నామని వివరించారు. మసీదుల వద్ద మొదలుకుని ముస్లిం మైనారిటీ వర్గాలు అధికంగా నివసించే ప్రాంతాలకు వెళ్లి అంజుమన్ భూములను టీడీపీ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నాన్ని వివరించి సంతకాలు సేకరిస్తామని తెలిపారు. 30వ తేదీన జరిగే ర్యాలీకి సంబంధించి 26, 27, 28 తేదీల్లో ముఖ్య సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. 29వ తేదీన మంగళగిరిలోని అంజుమన్ భూముల స్థలాన్ని స్వయంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీ జరుగుతున్నట్లు వివరించారు. అంజుమన్ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్‌అహ్మద్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లీం మైనారిటీ సమాజమంతా చినకాకానిలో 71.57 ఎకరాల అంజుమన్ భూముల పరిరక్షణ కోసం పరితపిస్తోందన్నారు.


