పార్టీ సంస్థాగత నిర్మాణం అత్యంత కీలకం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పశ్చిమ నియోజకవర్గ సమావేశం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయాలనేది.. అత్యంత కీలకమైన బాధ్యత అని, మన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం అంశంపై సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, టాస్క్‌ఫోర్స్ సభ్యుడు టీజేఆర్ సుధాకర్‌బాబు హాజరయ్యారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏ మాత్రం గురి తప్పకుండా పూర్తి చేయాల్సిన కార్యక్రమం కమిటీ నిర్మాణామని తెలిపారు. డివిజన్‌ల వారీగా కమిటీలను డివిజన్ అధ్యక్షుడు, ఆయా విభాగాల అధ్యక్షులు చర్చించి ఏర్పాటు చేయాలని సూచించారు. 26 డివిజన్‌లు ఉన్న పశ్ఛిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్‌లలో అన్ని అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. దీనితో పాటుగా ముఖ్యంగా డివిజన్ పరిధిలో ఎన్ని సచివాలయాలు ఉంటే.. అన్ని సచివాలయాల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు డిజిటైలేజ్ అయి వైఎస్ జగన్ డ్యాష్ బోర్డుకు వెళ్తాయని వివరించారు. భారతదేశంలో వైఎస్సార్ సీపీకి ఉన్న మాస్ బేస్ ఎవరికీ లేదని, దీనిని పార్టీ నిర్మాణం చేయాలన్నదే వైఎస్ జగన్ తలంపు అని చెప్పారు. కమిటీ నిర్మాణ బాధ్యత డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్‌లు, అనుబంధ విభాగాల నేతలపై ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఉదయం ఒక డివిజన్, సాయంత్రం మరో డివిజన్‌లో తాను కూడా పర్యటిస్తానన్నారు. గుంటూరు పశ్చిమలో గతంలో మూడు సార్లు ఓటమి పాలయ్యామని, వాటిని అధ్యయం చేసి, ఆ చిక్కులను తప్పుకుని ముందుకు వెళ్లాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను పోటీ చేయాలని వైఎస్ జగన్ ఇక్కడకు పంపారని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, టాస్క్‌ఫోర్స్ సభ్యుడు టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో, డివిజన్‌లో, వార్డులో పదవి పొందే ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుడేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఉగాది పండుగ లోపల పార్టీ సంస్థాగతంగా నిర్మించుకుని, ఐడీ కార్డులు ఇవ్వాలన్నదే వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. మరో 700 రోజులు దాటితే వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని, తాను ఎక్కడికి వెళ్లినా, పార్టీ నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. బాధ్యతతో పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. కమిటీల్లో మహిళలకు పెద్దపీట వేయటంతో పాటు, యువత ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కచ్చితంగా అనుకున్న సమయానికి కమిటీ నిర్మాణం పూర్తి అయ్యేలా పాటుపడదామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు మామిడి రాము, వంగల వలివీరారెడ్డి, ఈమని రాఘవరెడ్డి, పఠాన్ సైదాఖాన్, యేటి కోటేశ్వరరావుయాదవ్, చదలవాడ వేణు, చింతపల్లి వెంకటరమణ, దేవా, సింగు నరిసింహారావు, పల్లపు మహేష్, దేవరశెట్టి చిన్ని, వేలూరి అనిల్‌రెడ్డి, కీసరి సుబ్బులు, కీసరి సుబ్బారెడ్డి, కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి, సూరగాని వెంకటరెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, ఆలా కిరణ్, షరీఫుద్దీన్, షేక్ హుస్సేన్‌వలి, ప్రభు, కొరిటిపాటి ప్రేమ్, కార్పొరేటర్‌లు ఆచారి, రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, గురవయ్య, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నగర, జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


