ముగిసిన రాష్ట్రస్థాయి వృషభ రాజాల బండలాగుడు ప్రదర్శనలు
ఘంటసాల: ఒంగోలు జాతి వృషభాల సంరక్షణకు ఘంటసాల గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వృషభ రాజాల ప్రదర్శన ఆదర్శంగా నిలుస్తుందని ఎన్నారై గొర్రెపాటి రంగనాథబాబు అన్నారు. మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా డాక్టర్ గొర్రెపాటి నవనీతకృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో గ్రామస్తులు, దాతల సహకారంతో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజాల బండలాగుడు ప్రదర్శనలు శుక్రవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యూ కేటగిరి, రెండు పళ్ల విభాగం బండలాగుడు ప్రదర్శనలను ఎన్నారై రంగనాథబాబు, మూల్పూరి వెంకట్రావు, ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాసరావు, టీడీపీ నేత బొబ్బా గోవర్థన్, ఏఏంసీ చైర్మన్ తోట కనకదుర్గ, పలువురు ప్రముఖులు పోటీలను ప్రారంభించి ప్రసంగించగా నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.
న్యూ కేటగిరి విభాగం విజేత
ఎంకేఎం బుల్స్..
గురువారం జరిగిన న్యూ కేటగిరి విభాగంలో విజయవాడ – ఘంటసాలకు చెందిన ఎంకేఎం బుల్స్ అధినేత మేకా కృష్ణ మోహన్ ఎడ్లజత మొదటిస్థానం సాధించగా, గుంటూరు జిల్లా కొండవాలవారిపాలెంకు చెందిన జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి జత రెండో స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పోతిన లక్ష్మిత్ చౌదరి జత మూడో స్థానం సాధించాయి. నాల్గవ స్థానంలో గుంటూరు జిల్లా తోటపాలెంకు చెందిన రామినేని రత్తయ్య చౌదరి జత, ఐదో స్థానంలో కృష్ణాజిల్లా కళ్లంవారిపాలెంకు చెందిన బదిగం సుబ్బారెడ్డి జత, 6వ స్థానం సుఖవాసి సతీష్ బాబు జత, 7, 8 స్థానాల్లో కృష్ణాజిల్లా చినపులిపాకకు చెందిన ఆర్‌వీఎస్ బుల్స్ నిలిచాయి.
రెండు పళ్ల విజేత ఆర్కే బుల్స్ జత..
శుక్రవారం సాయంత్రం జరిగిన రెండు పళ్ల విభాగంలో బాపట్లజిల్లా వేటపాలెంకు చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి జత విజేతగా నిలవగా, కృష్ణాజిల్లా అయినపూడికు చెందిన మేడిశెట్టి వెంకటేశ్వరరావు జత, కొల్లిపరకు చెందిన ఆరేపల్లి ముక్తేశ్వరరావు జత ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాపట్ల జిల్లా క్రాపకు చెందిన టీఎస్‌ఆర్ బుల్స్ తలశిల రవితేజ, సాయితేజల జత నాల్గవస్థానం, ఘంటసాల గ్రామానికి చెందిన వీవీఆర్ బుల్స్ వేమూరి చిన్మయి ఎడ్ల జత, వల్లూరిపాలెంకు చెందిన చెన్నుపాటి నాగేంద్రం జత తర్వాత స్థానాల్లో నిలిచాయి. విజేతలైన వృషభాల యజమానులకు జీఎస్టీ డెప్యూటీ కమిషనర్ గొర్రెపాటి రవీంద్ర బాబు, రాధిక దంపతుల చేతుల మీదుగా నగదు బహుమతులను అందించారు.
ముగిసిన రాష్ట్రస్థాయి వృషభ రాజాల బండలాగుడు ప్రదర్శనలు


