కడచూపునకు ఖాకీల ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

కడచూపునకు ఖాకీల ఆంక్షలు

Jan 17 2026 8:52 AM | Updated on Jan 17 2026 8:52 AM

కడచూప

కడచూపునకు ఖాకీల ఆంక్షలు

కడచూపునకు ఖాకీల ఆంక్షలు

టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన సాల్మన్‌ భౌతికకాయం తరలింపునకు అడుగడుగునా ఆంక్షలు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు తనిఖీల పేరుతో పార్టీ శ్రేణులకు, బంధువులకు ఇబ్బందులు సాల్మన్‌ కోడలు, ఇతర కుటుంబసభ్యులకూ వేధింపులు రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, గౌతంరెడ్డి వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

దాచేపల్లి /పిడుగురాళ్ల /పిడుగురాళ్ల రూరల్‌: టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త దళితుడైన మందా సాల్మన్‌ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం పూర్తి అయిన తరువాత సాల్మన్‌ భౌతికకాయాన్ని స్వగ్రామమైన పిన్నెల్లికి తీసుకెళ్లారు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సాల్మన్‌కు నివాళులు అర్పించారు. జోహార్‌ సాల్మన్‌ నినాదాలతో పిన్నెల్లి మారుమ్రోగింది. బంధువులు, కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల అశ్రునయనాల మధ్య సాల్మన్‌ అంత్యక్రియలు జరిగాయి.

బరువెక్కిన హృదయంతో..

సాల్మన్‌ అంత్యక్రియల్లో గురజాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి బరువెక్కిన హృదయంతో పాల్గొన్నారు. సాల్మన్‌ భౌతిక కాయాన్ని చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. పూలదండలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటుగా తామంతా అండగా ఉంటామని కాసు భరోసా ఇచ్చారు. నరసరావుపేట పార్లమెంట్‌ పరిశీలకులు పూనూరి గౌతంరెడ్డితో కలిసి సాల్మన్‌ పాడె మోశారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశం వరకు ముందుకుసాగారు. పిన్నెల్లిలో స్వగృహం వద్దకు సాల్మన్‌ భౌతికకాయం చేరుకున్న తరువాత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాల్మన్‌ భార్య కుమారి, కుమారులు మరియదాసు, బిక్షం, కుమార్తెలు జ్యోతి, రాహేలు విలపించిన తీరు చూసి స్థానికులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ‘నాన్న.. మా కోసం లే... నాన్న’ అని కుమారులు, కుమార్తెలు గుండెలు పగిలేలా ఏడ్చారు. ‘అయ్యా నా కోసం వచ్చి హత్యకు గురయ్యావా’ అంటూ భార్య కుమారి విలపించిన తీరు చూపరుల గుండె బరువెక్కెలా చేసింది. కుమారి స్పృహతప్పి పడిపోవటంతో వైద్యసేవలు అందించారు. వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకుడు ఎం. మురళీధర్‌రెడ్డి, సీనియర్‌ నేత కొమ్మినేని వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్‌ ప్రసాద్‌, సొసైటీ మాజీ అధ్యక్షుడు చింతపల్లి పెదసైదా, వైస్‌ ఎంపీపీ చింతపల్లి నన్నే, మాజీ ఎంపీపీ దారం లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీ మోషే, మండల కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ మహ్మద్‌ జానీ, నాయకులు మందపాటి రమేష్‌రెడ్డి, చింతపల్లి పెదసైదా, తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల వైఖరికి నిరసన

అంతకుముందు సాల్మన్‌ అంత్యక్రియలకు పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గుంటూరు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం పూర్తి చేసిన తరువాత పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లికి సాల్మన్‌ భౌతికకాయాన్ని తీసుకువచ్చేంత వరకు పోలీసులు అందర్నీ వేధింపులకు గురిచేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. పిన్నెల్లి గ్రామంలో సాల్మన్‌ అంత్యక్రియలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాకుండా నిర్బంధం చేశారు. వచ్చే వారిని అడ్డుకునేందుకు రోడ్లపై మకాం వేశారు. తనిఖీ పేరుతో అడ్డుకుని, ఆధార్‌ కార్డు ఉండాలంటూ వేధించారు. పిన్నెల్లి గ్రామం నిర్మానుష్యంగా మారింది. దుకాణాలను పోలీసులు మూసివేయించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరి భాస్కర్‌ ప్రొద్బలంతోనే సాల్మన్‌ని టీడీపీ నాయకులు హత్య చేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పిన్నెల్లి వెళ్లే ప్రతి మార్గంలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేశారు. గురజాల, సత్తెనపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలోని వందలాది పోలీసులు అన్ని మార్గాలను నిర్బంధం చేశారు. అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే నుంచి పిన్నెల్లికి వెళ్లే రెండు ప్రధాన రోడ్లపై పోలీసులు బారికేడ్లు పెట్టారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్‌ పరిశీలకులు పూనూరు గౌతంరెడ్డి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులతో గుంటూరు నుంచి సాల్మన్‌ భౌతికకాయంతో బయలుదేరి మాచవరం మండలంకు చేరుకున్నారు. పోలీసులు అంబులెన్స్‌తో పాటుగా ఐదు కార్లు వెళ్లాలని హుకుం జారీ చేశారు. దీంతో అందరూ రోడ్డుపైనే బైఠాయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వారిని వెళ్లనిచ్చారు. డ్రోన్‌ కెమెరాలతో అంత్యక్రియలను పోలీసులు చిత్రీకరించారు. తుమ్మలచెరువు, కామేపల్లి వైపు నుంచి వచ్చిన వారిని పోలీసులు అటు ఇటు తిప్పుతూనే ఉన్నారని బంధువులు, స్నేహితులు వాపోయారు. చివరిచూపునకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కడచూపునకు ఖాకీల ఆంక్షలు1
1/1

కడచూపునకు ఖాకీల ఆంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement