రోగాలూ ఎంతో ఫాస్ట్
గుంటూరు మెడికల్: పిల్లలకు చిరుతిళ్లపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేనిది. స్కూల్‌కు వెళ్లాలంటే ఏదో ఒకటి కొనిస్తే తప్ప వెళ్లబోమని మారాం చేస్తారు. ఇంటర్‌వెల్ సమయంలో తప్పనిసరిగా చిరుతిళ్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వాల్సిందే. కంప్యూటర్ కాలంలో పిల్లల చిరుతిళ్లు సైతం మారిపోయాయి. ఒకప్పుడు చాక్లెట్, బిస్కెట్, వేరుశనగ ఉండలు, జీడీలు, పుల్ల ఐస్‌తోపాటుగా జామ, రేగిపండు లాంటి సీజనల్ పండ్లు పిల్లలు తినేవారు. పాఠశాలల వద్ద పిల్లల తినుబండారాలు అమ్మే దుకాణాల్లో సైతం ఇవే ఉండేవి. నేడు పరిస్థితి మారిపోయింది. రంగుల రంగుల ప్యాకెట్స్‌లో జంక్‌ఫుడ్‌ను దండలుగా వేలాడదీసి పిల్లలను ఆకర్షించేలా షాపుల వద్ద పెడుతున్నారు. రంగుల ప్యాకెట్లతో విషతుల్యమైన ఆహారం ఉంటుందని, వాటిని తింటే రోగాలు వస్తాయని తెలియక చిన్నారులు ఆరగిస్తున్నారు. వ్యాధుల బారిన పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల తిండి విషయంలో శ్రద్ధ చూపించని పక్షంలో తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో చిరుతిళ్ల విక్రయాలు చేసే దుకాణాలు వెయ్యికిపైగా ఉన్నాయి. తయారీ దుకాణాలు వంద వరకు ఉన్నాయి. కేవలం ఒక్క గుంటూరు నగరంలోనే 40 హోల్‌సేల్ షాపులు ఉండగా, రీటైల్‌గా 100 షాపుల వరకు ఉన్నాయి. వీటిల్లో ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ అధికారుల వద్ద అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారం విక్రయాలు చేసేవారి సంఖ్య వందకు మించి లేవు. కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం నాసిరకం బియ్యం, గోధుమ, మైదా, శనగపిండి, పామాయిల్‌తో ఇళ్లలోనే చిరుతిళ్లు తయారు చేస్తూ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఇలాంటి ఆహారం తినడం వలన పిల్లలు చిన్న వయస్సులోనే గ్యాస్ సంబంధిత సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నారు.
పిల్లలు ఎక్కువగా పిజ్జా, బర్గర్లు, నూడిల్స్, కుర్ కురేలు, ఫాస్ట్‌ఫుడ్ వంటివి తినడం వల్లల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి వ్యాధుల బారిన పడుతున్నారు. పాఠశాలల్లో, ఇళ్ల వద్ద వారికి వ్యాయామం లేకపోవడం, ర్యాంకుల కోసం పాఠశాలలు కూడా పిల్లలపై విపరీతమైన ఒత్తిడి చేయడం, పరీక్షలంటే పిల్లల్లో తీవ్ర ఆందోళన ఉండటం వల్ల గ్యాస్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. 5–17 ఏళ్ల వారు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ వలన వ్యాధుల బారిన పడిన వారిలో తేన్పులు ఎక్కువ రావడం, అల్సర్లు ఏర్పడడం, లూజు మోషన్స్, రక్తపు విరోచనాలు వంటి లక్షణాలు ఉంటున్నాయి.
బాధితుల వివరాలు ఇవీ..
గుంటూరు జీజీహెచ్‌లో 2022లో 744 మంది, 2023లో 900, 2024లో 1204 మంది, 2025లో 1604 మంది 5–17 ఏళ్లలోపు వారు ఫాస్ట్‌ఫుడ్ తిని వివిధ అనారోగ్య సమస్యలతో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య విభాగంలో చికిత్స పొందారు.
● నాణ్యతలేని ఫాస్ట్‌ఫుడ్‌తో అనారోగ్యం
● చిన్న వయస్సులోనే గ్యాస్ట్రబుల్ సమస్యలు
● జంక్ ఫుడ్‌తో పెరుగుతున్న వ్యాధులు
● కనీసం పట్టించుకోని అధికారులు
జిల్లాలో వెయ్యికిపైగా షాపులు...
వ్యాధులకు కారణాలు
నేడు ఎంతో మంది బయటి ఆహారం ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు సైతం ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించి చికిత్స అందించని పక్షంలో తీవ్రంగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.