గంజాయి ముఠా అరెస్టు
కూలీ పనులకు వెళ్తూ..
● అరకు నుంచి తీసుకొచ్చి అమ్మకాలు
● 4.95 కిలోల గంజాయి స్వాధీనం
● 150 గ్రాముల ప్యాకెట్లతో విక్రయాలు
● క్రయ, విక్రయాలు చేసిన
14 మంది నిందితులు అరెస్ట్
● వివరాలు వెల్లడించిన
ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేసి, 4.95 కిలోల గంజాయిని పెదకాకాని పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో ఆదివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో ఆదివారం పెదకాకాని గ్రామ పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ సమీపంలోని పాత రేకుల షెడ్‌లో తనిఖీలు నిర్వహించారు. షెడ్‌లో ఉన్న నలుగురు ఉడాయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నలుగురిని పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. గంజాయి క్రయ విక్రయాలతోపాటు తాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు మంగళగిరి పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ రోడ్‌లో ఉంటున్న ముత్యాల రమణారావు అలియాస్ రాకీ, ప్రస్తుతం పెదకాకాని ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వాసి నూనె యోహాన్, పెదకాకాని తక్కెళ్లపాడు గ్రామ ఎస్టీకాలనీ వాసి పేరం ఓంకార్, నంబూరు గ్రామం విజయభాస్కర్‌నగర్ ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఉంటున్న వేమూరి షారోన్ అలియాస్ రాకేష్‌తోపాటు మంగళగిరి రైల్వేస్టేషన్ రోడ్‌లో ఉండే షేక్ సిద్ధయ్య అలియాస్ సిద్ధు, నంబూరు అలీరఫత్ కాలనీ వాసి మొక్కాల సుధాకర్ అలియాస్ జాన్సన్, తక్కెళ్లపాడు ఎస్టీ కాలనీకి చెందిన కాట్రగుంట సువర్ణరాజు, పేరం గోపీ, పెదకాకాని పాతూరు వాసి షేక్ సమీర్, నంబూరు గ్రామం విజయభాస్కర్ నగర్ వాసి కొలకలూరి రాకేష్, కేసాని వెంకటేశ్వరరావు అలియాస్ వెంకి, నంబూరు నాగేశ్వరరావు అలియాస్ అబ్బు, కుంబ సాయికిరణ్, శృంగారపాటి విశాల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వారి నుంచి 4.95 కిలోల గంజాయి సీజ్ చేశారని చెప్పారు.
30 ఏళ్ల ముత్యాల రమణారావు అలియాస్ రాకీ పూల మార్కెట్‌లో కూలీ పనులకు వెళ్లేవాడని ఎస్పీ తెలిపారు. అతనే అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి, పెదకాకానిలో ఉండే నూనె యోహాన్, పేరం ఓంకార్, వేమూరి షారోన్‌లకు సరఫరా చేసేవాడని అన్నారు. రాకీపై పెదకాకాని, తాడేపల్లి పీఎస్‌లో నాలుగు గంజాయి కేసులు, మంగళగిరి రూరల్ పీఎస్‌లో డెకాయిటీ కేసు, సూర్యారావుపేట పీఎస్‌లో చోరీ కేసు ఉందన్నారు. రాకీ వద్ద కొనుగోలు చేశాక యోహాన్ చిన్న ప్యాకెట్‌లలో గంజాయి పెట్టి విక్రయించేవాడని అన్నారు. అతనిపై అరండల్‌పేట పీఎస్‌లో కొట్లాట కేసు ఉందన్నారు. 23 ఏళ్ల ఓంకార్‌పై నగరంపాలెం పీఎస్‌లో గొలుసు చోరీ, కొట్లాట కేసులు ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్ వేమూరి షారోన్ అలియాస్ రాకేష్ గంజాయి విక్రయాల్లో సహకరించేవాడని, అతనిపై కూడా పెదకాకాని పీఎస్‌లో ఒక గంజాయి కేసు ఉందన్నారు. సుమారు 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లను విక్రయించే వారని అన్నారు. ఈ కేసుని ఛేదించిన పెదకాకాని పీఎస్ సీఐ టీపీ.నారాయణస్వామి, ఎస్‌ఐలు షేక్ ఎండీ.మీరాజ్, డి.రామకృష్ణ, హెచ్‌సీలు ఎన్.శ్రీనివాసరావు, సీహెచ్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు ఎండీ ఇర్ఫాన్, వి.సుధాకర్‌లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్పీలు మురళీ కృష్ణ (ఉత్తర సబ్ డివిజన్), జి.శ్రీనివాసులు (ఎస్‌బీ), సీఐ అలహరి శ్రీనివాస్ (ఎస్‌బీ) తదితరులు పాల్గొన్నారు.


