సీఎం వస్తే మొక్కల ఖర్చే రూ.లక్షలు!
నెహ్రూ నగర్: గుంటూరు నగరానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే చాలు.. నగరపాలక సంస్థ రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు తీసుకురావడం పరిపాటిగా మారింది. గత సంవత్సరం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గుంటూరు వచ్చిన సీఎంకు గుంటూరులో పచ్చదనం కనిపించేలా రోడ్లమీద, డివైడర్ల మీద ప్రత్యేకంగా రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు పెట్టారు. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో తెచ్చిన కొద్ది రోజులకే ఎండిపోయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. దీనికి సంబంధించిన బిల్లు సుమారు రూ. 30 లక్షలు ప్రాసెస్ చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం గుంటూరు నగర పరిధిలో ఉన్న శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఆ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దీంతో మళ్లీ పలు రోడ్లు మెరిసిపోతున్నాయి. రోడ్డుకు రెండు పక్కల మొక్కలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. అరండల్‌పేటలోని పాత కమిషనర్ బంగ్లాలో లారీల్లో మొక్కలు దింపడంపై ప్రజలు విస్తుపోతున్నారు. మొక్కలు తీసుకురావడంపై ఉన్న శ్రద్ధ వాటిని పరిరక్షించడంపై కూడా చూపాలని నగరవాసులు కోరుతున్నారు.
సీఎం వస్తే మొక్కల ఖర్చే రూ.లక్షలు!


