శిల్పాలు, పత్రాలను పరిరక్షించుకోవాలి
ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్‌ఎంపీ, పీఎంపీల డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి
నాదెండ్ల: గుంటూరులో ఈ నెల 10న నిర్వహించే ఆర్‌ఎంపీ, పీఎంపీల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్‌ఎంపీ, పీఎంపీల నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి శనివారం చెప్పారు. ఈ సందర్భంగా తూబాడులో ఆయన మాట్లాడుతూ మూడు ఫెడరేషన్లతో సంయుక్తంగా ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ జరుగుతుందన్నారు. ఏటుకూరు రోడ్డులోని ఆదిత్య హాస్పటల్ ప్రాంగణంలో జరిగే సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రాథమిక వైద్యానికి గుర్తింపు కోసం నలభై ఏళ్లు పైబడి చేస్తున్న పోరాటం సాఫల్యం అయ్యేరోజు ఆసన్నమైందన్నారు. మహాసభకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, జేఏసీ గౌరవ అధ్యక్షుడు డీటీ జనార్ధన్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని మూడు వేల మందికి పైగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు హాజరవుతారన్నారు.
పెదకాకాని: ఒక జాతి గొప్పతనం ఆ జాతి చరిత్రపై ఆధారపడి ఉంటుందని అవనిగడ్డ శాసనసభ సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. చరిత్ర సాక్ష్యాలైన శాసనాలు, శిల్పాలు, పత్రాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయంలో రెండురోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలను శనివారం మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన ద్వారా మన చరిత్ర చాలా నష్టపోయిందని చెప్పారు. ఆంధ్రపద్రేశ్ చరిత్రకు సంబంధించి తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న పురావస్తు వస్తువులు, శిల్పాలు, శాసనాలు, నాణేలు, తాళపత్ర గ్రంథాలు, రాత ప్రతులను మనం ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెచ్చుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరులో నిర్వహించిన 47వ వార్షిక సమావేశాలలో సమర్పించిన పరిశోధనా పత్రాల సంపుటిని హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, అధ్యక్షులు బి.కేశవనారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డిలతో కలిసి మండలి బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సమావేశాలకు హాజరైన 150 మంది చరిత్ర పరిశోధకులు ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల చరిత్ర విభాగాల కీలక ఉపన్యాసాలు, చారిత్రక రచనా విధానం స్థానిక చరిత్ర విభాగాలపై పరిశోధనా పత్రాలను ఆచార్య పి.సి. వెంకటసుబ్బయ్య, ఈఎస్‌ఎం ప్రసాద్, కె.గంగయ్య, బెల్లంకొండ రమేష్ చంద్రబాబు అధ్యక్షతన అందించారు.
● కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ హిస్టరీ అధ్యాపకురాలు ప్రొఫెసర్ అలోకా పరాశర్ శేస్ 6 నుంచి 14వ శతాబ్దంలో జరిగిన గ్రామీణ సామాజిక, ఆర్థిక పరిణామాల గురించి మామిడిపూడి వెంకట రంగయ్య 22వ స్మారక ఉపన్యాసంతో తొలిరోజు సమావేశాలు ముగించారు. ఈ సందర్భంగా ఈశ్వర వరప్రసాద్ పరిషత్తు సహకారంతో కోకా విజయలక్ష్మి నృత్య దర్శకత్వంలో ప్రదర్శించిన తెలుగు ప్రశస్తి నృత్య రూపకం విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, హిస్టరీ కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు ఆచార్య ఏఆర్ రెడ్డి, వీవీఐటీయూ పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవికృష్ణ హాజరయ్యారు.
ఘనంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభం
శిల్పాలు, పత్రాలను పరిరక్షించుకోవాలి


