కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం
తాడేపల్లి రూరల్: సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు సోమవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వారు వెళ్లి విజయవాడ నుంచి కృష్ణా కెనాల్‌కు వచ్చే రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, ఒక కన్ను పూర్తిగా పోయి లొట్టగా ఉందని తెలియవచ్చింది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 ఉండొచ్చు. ట్రైన్‌లో నుంచి జారి పడ్డాడా? గతంలో మాదిరి రైల్వేబ్రిడ్జిపై హత్యచేసి కిందకు నీళ్లలోకి పడవేశారా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ముందు వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక బైక్‌పై వస్తున్న వ్యక్తి టిప్పర్‌ను ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చిన్న కాకాని గ్రామానికి చెందిన వల్లభాపురం నరేష్(38) కృష్ణాయపాలెంలో ఓ కంపెనీలో పని చేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం నరేష్ తమ్ముడికి కంపెనీ నుంచి ఫోన్ చేసి మీ అన్నయ్య వెస్ట్ బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీయగా, నున్నలో ఓ పని కోసం వచ్చి, ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో నరేష్‌కు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాడు. దీంతో మృతుని భార్య కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. వారి మొరను ఆయన అలకించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు) పాల్గొన్నారు.
అనధికారికంగా షెడ్ల నిర్మాణం
కోనేరు వెనుక హిందూ అపరకర్మలకు స్థలం ఉంది. మేం ఊరెళ్లిన సమయంలో ఆవరణలో, రహదారిపై అక్రమంగా షెడ్‌లు నిర్మించారు. తీసేయాలని సదరు వ్యక్తులకు విన్నవించినా పట్టించుకోలేదు. అందులో మూడు షెడ్‌లను నిర్మించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. సిబ్బందికి రక్షణతో పాటు సంఘ ఆస్తులకు భద్రత కల్పించాలని విన్నవించాం. అయినప్పటికీ చర్యల్లేవు. జీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – జీవీ. కుమార్, అన్నవరపు పాండురంగరావు
( హిందూ అపరకర్మల నిర్వహణ సంఘం )
కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం


