సహకార ఉద్యోగుల ఆందోళన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్రాడీపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణలో ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్‌ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్స్యూరెన్స్‌ను చేయించాలని సూచించారు. జీతభత్యాల్లో కోత విధించడం సరైనది కాదన్నారు. ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, కనీస వేతనం తగ్గకుండా ప్రతి ఉద్యోగికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 29వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడతామన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే జనవరి 5వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహకార సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.


